బైడెన్ కీలక నిర్ణయం-రష్యా స్ధానంలో ఇరాన్, వెనెజులా చమురు-ఆంక్షలు సడలించే దిశగా
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షల కత్తి ఝళిపించాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అమెరికా, సౌదీ తర్వాత మూడో స్ధానంలో ఉన్న రష్యాపై విధించిన ఆంక్షలతో పలు దేశాల్లో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.
Recommended Video
గతంలో చమురు ఆధారిత దేశాలైన ఇరాన్, వెనెజులాపై వివిధ కారణాలతో విధించిన ఆంక్షల్ని సడలించేందుకు యూఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తద్వారా రష్యాపై విధించిన ఆంక్షల ప్రభావం అంతర్జాతీయంగా చమురు ధరలపై పడకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఇప్పట్లో ఆంక్షలు సడలించే అవకాశాలు లేకపోవడం, అదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరల మంట పలు దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అమెరికాలో బైడెన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ధరల పెరుగుదల మధ్య ప్రపంచ ముడి చమురు సరఫరాలను పెంచడానికి వెనిజులా, ఇరాన్‌లకు అమెరికా చేరువవుతోంది. ఈ ఆంక్షలు సరఫరాలకు ఎలా అంతరాయం కలిగించాయన్న దానితో పాటు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాము ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికా, సౌదీ అరేబియా తర్వాత రష్యా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు, అలాగే రండో అతిపెద్ద ఎగుమతిదారు కూడా. రష్యా ప్రస్తుతం రోజుకు 7.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తోంది. ఆంక్షల ద్వారా ప్రపంచ సరఫరా నుండి రష్యాను తొలగిస్తే ఆ మేరకు ముడి చమురు ఎగుమతులను భర్తీ చేయడానికి మార్గం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి చర్య ధరలను ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి పెంచవచ్చనే అంచనాలున్నాయి. దీంతో అమెరికా దీన్ని అరికట్టేందుకు వేగంగా అడుగులేస్తోంది.












Click it and Unblock the Notifications