H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది!
అమెరికా కలలు కంటున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరటనిస్తూ 2027 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. చట్టబద్ధమైన గరిష్ట పరిమితికి అనుగుణంగా మొత్తం 85,000 మంది లబ్ధిదారులను యూఎస్‌సీఐఎస్ (USCIS) లాటరీ పద్దతిలో ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల తరపున కంపెనీలు వీసా పిటిషన్లు దాఖలు చేసేందుకు విండోను ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
అర్హులైన పిటిషనర్లు తమ దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచే యూఎస్‌సీఐఎస్‌కు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో సాధారణ కోటాతో పాటు ఉన్నత విద్య (మాస్టర్స్) మినహాయింపు కింద ఎంపికైన వారు కూడా ఉన్నారు. పిటిషన్లను దాఖలు చేయడానికి కనీసం 90 రోజుల గడువు ఉంటుందని, దరఖాస్తుతో పాటు ఎంపిక నోటీసు నకలును (Selection Notice Copy) తప్పనిసరిగా జతచేయాలని సూచించారు. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 27న విడుదల చేసిన కొత్త ఫారం I-129 ఎడిషన్‌ను మాత్రమే అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

వేతన ఆధారిత ఎంపికకే ప్రాధాన్యం.
హెచ్-1బీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. గతంలో ఉన్న లాటరీ విధానం కంటే 'వేతన ఆధారిత నమూనా'కు (Wage-based model) ప్రాధాన్యతనిస్తోంది. దీని ప్రకారం.. అత్యధిక వేతనం పొందే నిపుణులు, అసాధారణ నైపుణ్యాలు ఉన్నవారికే వీసా కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు, అమెరికా కార్మిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
కఠినతరం అవుతున్న నిబంధనలు..
విదేశీ నియామకాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా మరికొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొన్ని నిర్దిష్ట కేసులలో విదేశీ కార్మికులను స్పాన్సర్ చేసే యజమానులు సుమారు 100,000 డాలర్ల వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పిటిషన్ సమర్పించే సమయంలో రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న పాస్‌పోర్ట్ వివరాలు, గుర్తింపు పత్రాలు మరియు ఎంపిక చేసిన వేతన స్థాయికి సంబంధించిన రుజువులను పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది.
కోటా వివరాలు..
- యూఎస్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం, ఏటా హెచ్-1బీ వీసాల గరిష్ట పరిమితి 85,000 గా ఉంది.
- సాధారణ కోటా: 65,000 వీసాలు.
- మాస్టర్స్ కోటా: అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారి కోసం అదనంగా మరో 20,000 వీసాలు.
భారతీయ టెక్ కంపెనీలు, నిపుణులు ఈ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కంపెనీలన్నీ డాక్యుమెంటేషన్ పనుల్లో నిమగ్నమయ్యాయి.












Click it and Unblock the Notifications