• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్రాంత్: ఈ విమాన వాహక యుద్ధ నౌకను తయారు చేసేందుకు ఎంత ఖర్చయింది, దీని ప్రత్యేకతలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విక్రాంత్

''మిమ్మల్ని ఈ నౌకలో ఒంటరిగా విడిచిపెడితే, అసలు ఎటు వెళ్లాలో తెలుస్తుందా?’’అని నేను అడిగాను.

''ఇప్పుడైతే నాకు తెలుసు. అయితే, ఇక్కడున్న మార్గాల గురించి తెలుసుకోవడానికి నాకు రెండు నెలలు పట్టింది’’అని నవ్వుతూ భారత నౌకా దళానికి చెందిన ఓ అధికారి నాతో చెప్పారు.

భారత్ దేశీయంగా డిజైన్‌తోపాటు అభివృద్ధి చేసిన విమాన వాహక నౌక ''విక్రాంత్’’ సెప్టెంబరు 2న లాంఛనంగా విధుల్లోకి అడుగుపెట్టబోతోంది. విక్రాంత్ అనేది సంస్కృత పదం. దీనికి ''ధైర్యం’’ అని అర్థం.

భారత నౌకా దళానికి అధికారికంగా విక్రాంత్‌ను అప్పగించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోచి రాబోతున్నారు.

నౌకా దళంలో చేరిన తర్వాత ఈ నౌక ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) విక్రాంత్‌గా మారుతుంది.

లోపల ఎలా ఉంది?

విక్రాంత్ లోపలకు ప్రవేశించిన వెంటనే భిన్న కంపార్ట్‌మెంట్లు కనిపిస్తాయి. లోపల దాదాపు 2300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అసలు నౌకలో ఉన్నామనే మనకు అనిపించదు.

262 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుండే ఈ నౌకలో ఉన్నప్పుడు సముద్రంలో అలల ప్రభావం పెద్దగా కనిపించదు. లోపల భిన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. వీటి సాయంతో చాలా తేలిగ్గానే అటూఇటూ వెళ్లొచ్చు. ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల వల్ల పెద్దగా వేడి, చలి కూడా తెలియదు.

విక్రాంత్ అనే పేరును భారతీయులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తొలి భారత విమాన వాహక నౌక పేరు కూడా ఇదే. రాయల్ నేవీ నుంచి కొనుగోలుచేసిన ఆ నౌక 1961లో విధుల్లోకి చేరింది. అయితే, 1997లో దీన్ని విధుల్లో నుంచి తొలగించారు. చాలా కీలక సైనిక ఆపరేషన్లలో ఆ నౌక ప్రధాన పాత్ర పోషించింది.

ఇప్పుడు నేటి విక్రాంత్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో దాదాపు 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ కేబుళ్లను ఏర్పాటుచేయడం, పాలిషింగ్, అంతర్గత డిజైన్ల కోసం మరో 2,000 మంది అదనంగా పనిచేస్తున్నారు. ఈ పనులన్నీ శుక్రవారం కల్లా పూర్తవుతాయి.

ఇక్కడ పనిచేస్తున్న వారి మధ్య మా లాంటి పర్యటకులు కూడా తిరుగుతున్నారు. మొత్తంగా అంతా ధ్వనులతో బిజీబిజీగా కనిపిస్తోంది.

మేం ఇక్కడి నుంచి థ్రోటిల్ కంట్రోల్ రూమ్ (టీసీఆర్)కు వెళ్లాం.

''ఇది నౌకకు గుండె లాంటిది. ఇక్కడి నుంచే గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు పనిచేస్తాయి. వీటి సాయంతోనే నౌక ముందుకు వెళ్తుంది’’అని సీనియర్ ఇంజినీర్, లెఫ్టినెంట్ కమాండర్ సాయి కృష్ణన్ చెప్పారు.

అక్కడి నుంచి మేం ''గ్యాలరీ’’గా పిలిచే ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ కాఫీ మెషీన్లు, అందంగా తీర్చిదిద్దిన టేబుల్స్, కుర్చీలు, కంటైనర్లు కనిపించాయి. నిజానికి ఇదొక క్యాంటీన్ లేదా ప్యాంట్రీ అనుకోవచ్చు. ఇలాంటివి విక్రాంత్‌లో మూడు ఉన్నాయి. ''ఈ మూడింటిలోనూ మొత్తంగా ఒకేసారి 600 మంది సిబ్బంది కలిసి భోజనం చేయొచ్చు’’అని ఒక అధికారి నాతో చెప్పారు.

కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత, ఎడమ వైపు మాకు వసతిని కల్పించే క్వార్టర్స్ కనిపించాయి. లోపల పరుపులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉన్నాయి.

ఆ తర్వాత విక్రాంత్‌లోని భారీ వైద్య సదుపాయాలను చూసేందుకు వచ్చాం. ఇక్కడ ఏర్పాటుచేసిన 16 పడకల ఆసుపత్రిలో రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌ మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు. భారత్‌లోని నౌకల్లోని ఆసుపత్రుల్లో ఇదే అతిపెద్దదని అధికారులు చెప్పారు.

ఆ తర్వాత ఇది అద్భుత నౌక అని గుర్తుచేసే చాలా ప్రాంతాలను చూశాం. ఇది మామూలు నౌక కాదు.. దీనిలో 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు.

హ్యాంగర్‌లో అలా...

అక్కడి నుంచి మేం హ్యాంగర్‌లోకి అడుగుపెట్టాం.

నిజానికి విక్రాంత్ కంటే ఎక్కువ యుద్ధ విమానాలను తరలించే నౌకలు ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్ రాయల్ నేవీలో క్వీన్ ఎలిజబెత్‌లో దాదాపు 40, అమెరికా నావీలోని నిమిట్జ్ క్యారియర్లలో 60కిపైగా విమానాలను తరలించొచ్చు.

విక్రాంత్ హ్యాంగర్‌లో ఒక చివరన రష్యా నుంచి తీసుకొచ్చిన మిగ్-29కే, కమోవ్-31 యుద్ధ విమానాలు కనిపించాయి.

''ఇదొక పార్కింగ్ స్థలంలా కనిపించింది. ఇక్కడ మరమ్మతులు, మెయింటెన్స్ కోసం ఒక బృందం పనిచేస్తోంది’’అని లెఫ్టినెంట్ కమాండర్ విజయ్ శివారన్ చెప్పారు.

ఆ తర్వాత మేం డెక్ దగ్గరకు వచ్చాం. ఇక్కడే విమానాల రాకపోకలు జరుగుతాయి.

భిన్న దశల్లో విక్రాంత్‌లోని దాదాపు అధునాతన వ్యవస్థలన్నీ పరీక్షించారు. అయితే, ''ఫ్లయింగ్ ఆపరేషన్లు’’ను మాత్రం టెస్టు చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో ఆ పరీక్షలు కూడా పూర్తవుతాయి.

లెఫ్టినెంట్ కమాండర్ సిద్ధార్థ్ సోని.. ఫ్లైట్ డెక్ ఆఫీసర్‌గా, హెలికాప్టర్ పైలట్‌గా పనిచేస్తున్నారు.

''ఈ ఫ్లైట్ డెక్ పరిమాణం 12,500 చదరపు మీటర్లు. అంటే రెండున్న హాకీ మైదాలకు ఇది సమానం. ఒకేసారి 12 విమానాలు, ఆరు హెలికాప్టర్లను ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. చోటు ఎంత ఎక్కువుంటే మనం అన్ని ఎక్కువ విమానాలను ఆపరేట్ చేయొచ్చు’’అని ఆయన అన్నారు.

ఒకే హ్యాంగర్‌లో రష్యా, అమెరికా, భారత హెలికాప్టర్లకు విక్రాంత్ అతిథ్యం ఇవ్వబోతోంది.

45,000 టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. చైనా కూడా సొంతంగానే ఇలాంటి నౌకలను అభివృద్ధి చేసుకుంటోంది.

ఇది దాడులను ఎలా అడ్డుకుంటుంది?

అసలు ఇది ఎలా పనిచేస్తుందో కెప్టెన్ రజత్ కుమార్ మాతో చెప్పారు. ''ఇది ఎప్పుడూ ఒంటరిగా వెళ్లదు. దీనితోపాటు మరికొన్ని నౌకలు కూడా ఉంటాయి. విధ్వంసక నౌకలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాముల విధ్వంసక నౌకలు, విమాన విధ్వంసక నౌకలు ఇలా చాలా ఉంటాయి. మరోవైపు ముప్పులను ఎదుర్కొనేందుకు విక్రాంత్‌లోనూ అధునాతన వ్యవస్థలు ఉన్నాయి’’అని ఆయన వివరించారు.

మేం బయటకు వెళ్లే ముందుగా లెఫ్టినెంట్ కమాండర్ చైతన్య మల్హోత్ర మాట్లాడారు. విక్రాంత్‌కు కీలకమైన వాతావరణ అంచనాలను చైతన్య బృందం అందిస్తుంది.

''ఉదాహరణకు విమానాల ల్యాండింగ్‌లలో గాలి కీలకపాత్ర పోషిస్తుంది. గాలి ఎటు నుంచి వస్తుంది? వర్షం పడే అవకాశముందా? లాంటి అంచనాలను మా బృందం వెల్లడిస్తుంది. మేం ఎప్పటికప్పుడే అంచనాలు వెల్లడిస్తాం’’అని ఆయన వివరించారు.

మొత్తంగా..

ఇతర యుద్ధ నౌకలతో పోల్చినప్పుడు విమాన వాహక నౌకలు ప్రత్యేకమైనవి. అవసరమైన సమయాల్లో మొత్తం మన మిషన్‌ను ఇవి తరలించగలవు.

నౌకా దళంలో విక్రాంత్ చేరడంతో భారత్‌లో ఇప్పుడు రెండు విమాన వాహక నౌకలు ఉంటాయి.

అయితే, మరొకటి కూడా అవసరం ఉంటుందని నౌకా దళం చెబుతోంది. ఇదే విషయాన్ని నావికా దళ అధిపతులు చాలాసార్లు చెప్పారు.

రక్షణ రంగంలో స్వావలంబనపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ, రక్షణ రంగానికి సరిపడా నిధులు అందడం లేదని సైనిక నిపుణులు అంటున్నారు.

నిధులపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని విక్రాంత్ పనితీరును దగ్గరుండి పర్యవేక్షించిన విశ్రాంత వైస్ అడ్మిరల్ ఏకే చావ్లా మాతో అన్నారు.

''ఇలాంటి నౌకల అవసరాన్ని 1980లలోనే చైనా గుర్తించింది. ఆర్థిక సరళీకరణల తర్వాత వారు నౌకా దళంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు చూడండి.. వారు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా శక్తిగా అవతరించారు. మెరుపు వేగంతో వారు విమాన వాహక నౌకలను అభివృద్ధి చేస్తున్నారు. మనం ఒక్క రోజు రాత్రిలోనే ఇలాంటి నౌకలను అభివృద్ధి చేయలేం. దీనికి చాలా సమయం పడుతుంది. విక్రాంత్ లాంటి నౌకలు మనకు మరిన్ని అవసరం అవుతాయి’’అని ఆయన వివరించారు.

బయట ఇలా..

నౌక వెలుపల నౌకా దళ బ్యాండ్ ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్ధం అవుతోంది. పెద్దపెద్ద క్రేన్ల సైరన్లు కూడా వినిపిస్తున్నాయి.

జనవరి 2003లోనే ఈ నౌకను నిర్మించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, 2007లో దీని పనులు మొదలయ్యాయి.

2013లో తొలిసారి ఈ నౌక సముద్రంలోకి ప్రవేశించింది. 2016-17లోగా ఇది నౌకా దళం చేతికి అందుతుందని ప్రభుత్వం భావించింది.

అయితే, నిర్మాణంలో రెండో దశ చాలా ఆలస్యమైంది. ముఖ్యంగా రష్యా నుంచి రావాల్సిన ఆయుధాలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, ఏవియేషన్ కాంప్లెక్స్‌లలో జాప్యం చోటుచేసుకుంది.

మొత్తంగా ఈ నౌకను ఇలా తీర్చిదిద్దడానికి 13ఏళ్లు పట్టిందని కోచి షిపియార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మధు నాయర్ చెప్పారు. ''13ఏళ్లలో పని పూర్తిచేశామని మేం గొప్పగా చెప్పడం లేదు. మేం ఇంకా మెరుగ్గా కూడా పనిచేయొచ్చు. కానీ, ఇది మా మొదటి ప్రయత్నం. ఈ విషయంలో మేం సంతృప్తిగా ఉన్నాం’’అని అన్నారు.

''మనం చైనాతో పోల్చుకున్నప్పుడు అక్కడున్న పరిస్థితులను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌ల కంటే చైనా వేగంగా ముందుకు వెళ్తోంది’’అని ఆయన చెప్పారు.

ఎంత ఖర్చయింది?

మొత్తంగా విక్రాంత్ కోసం రూ.20,000 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెట్టింది.

నౌక నిర్మాణంలో అవసరమైన 76 శాతం సామగ్రిని దేశీయ సంస్థల నుంచే కొనుగోలు చేశారు. దీని కోసం సీఎస్‌ఎల్, నౌకా దళం కలిసి మొత్తంగా 500 దేశీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఈ నౌకా నిర్మాణం ద్వారా 13ఏళ్లలో మొత్తంగా 15,000 ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

విక్రాంత్‌ను లాంఛనంగా నౌకా దళంలో ప్రవేశపెట్టడం ఒక అద్భుత ఘట్టమని సీఎస్ఎల్ జనరల్ మేనేజర్ (డిజైన్) అంజన కేఆర్ చెప్పారు.

''డిజైనింగ్ కోసం 2009లో మెటీరియల్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేశాను. సామగ్రి కోసం భిన్న సంస్థలతో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పట్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లదేమోనని ఒకసారి అనిపించింది. కానీ, నౌకా దళం, ప్రభుత్వం, మేం కలిసి ముందుకు వెళ్లాం’’అని ఆమె చెప్పారు.

2013లో విక్రాంత్ తొలిసారి సముద్రంలోకి వెళ్లినప్పుడు అంజన భావోద్వేగానికి గురయ్యారు.

''ఈ నౌక నాకు ఒక బిడ్డ లాంటిది. నాతోపాటు ఇది చాలా ఏళ్లు ఉంది. డిజైన్ నుంచి నేటి వరకు దగ్గరుండి అన్నీ మేం చూసుకున్నాం. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసి, అత్తారింటికి పంపినట్లు అనిపిస్తోంది. అత్తింటి వారు (నౌకా దళం) దీన్ని బాగా చూసుకోవాలి’’అని ఆమె నవ్వుతూ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vikrant: How much does this aircraft carrier cost to build and what are its features?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X