వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం ''ఆకుస్ (AUKUS)’’పై ఒకవైపు నుంచి ఫ్రాన్స్, మరోవైపు నుంచి చైనా ధ్వజం ఎత్తుతున్నాయి.

ఈ ఒప్పందానికి నిరసనగా ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తమ రాయబారులను చర్చల కోసం ఫ్రాన్స్ వెనక్కు పిలిపించింది.

''మమ్మల్ని మోసం చేశారు.. మా నమ్మకాన్ని వమ్ముచేశారు. ఇది మమ్మల్ని అగౌరవ పరచడమే’’అని తాజాగా అమెరికా, ఆస్ట్రేలియాలపై ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ ఎస్ లే డ్రియన్ వ్యాఖ్యలుచేశారు.

మరోవైపు ''ఇదొక బాధ్యతారాహిత్యమైన ఒప్పందం. సంకుచిత ధోరణికి ఇదొక ఉదాహరణ. ప్రచ్ఛన్న యుద్ధంనాటి మనస్తత్వానికి ఈ ఒప్పందం అద్దం పడుతోంది’’అంటూ చైనా ధ్వజం ఎత్తింది.

ఏమిటీ ఒప్పందం?

అణు జలాంతర్గాముల సాంకేతికతను (న్యూక్లియర్ సబ్‌మెరీన్) ఆస్ట్రేలియాకు బదిలీ చేయడమే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చినట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇది చైనా లక్ష్యంగా సిద్ధంచేసిన ఒప్పందం కాదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో నెలకొంటున్న ఉద్రిక్తతలు, వివాదాస్పద వాతావరణానికి తెరదించేందుకు ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల సాంకేతికతను బదిలీ చేయడమే లక్ష్యంగా ఆకుస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియా.. చైనాను తన శత్రుదేశంగా మార్చేసుకుందని గ్లోబల్ ట్రైమ్స్‌లో ఓ కథనం కూడా ప్రచురితమైంది.

ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ ఎస్ లే డ్రియన్

ఫ్రాన్స్ కోపం ఎందుకు?

సంప్రదాయ జలాంతర్గాముల సాంకేతికత బదిలీ కోసం ఇదివరకు ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆకుస్ ఒప్పందం వల్ల ఈ ఒప్పందం రద్దైంది.

ఈ ఒప్పందంపై కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని ఫ్రాన్స్ అంటోంది. తమ మిత్ర దేశాలతో తీవ్రమైన సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి శనివారం వ్యాఖ్యానించారు.

''అమెరికా-ఫ్రాన్స్ సంబంధాల్లో ఇలా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య సంక్షోభ తీవ్రతకు ఈ పరిణామాలే ఉదాహరణ. మాకు అమెరికా, ఆస్ట్రేలియా అబద్ధాలు చెప్పాయి’’అని ఆయన అన్నారు.

బ్రిటన్ నుంచి దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించే ఉద్దేశంలేదని ఫ్రాన్స్ స్పష్టంచేసింది. అయితే, బ్రిటన్ కూడా అవకాశవాద ధోరణితో వ్యవహరించిందని ధ్వజమెత్తింది.

బ్రిటన్ తర్వాత ఆస్ట్రేలియాకే..

గత 50ఏళ్లలో బ్రిటన్ మినహా ఏ ఇతర దేశాలకు అణు జలాంతర్గాముల సాంకేతికతను అమెరికా బదిలీ చేయలేదు.

అంటే, ఈ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములను అభివృద్ధి చేసుకోగలుగుతుంది. ఇవి సంప్రదాయ జలాంతర్గాముల కంటే వేగంగా కదులుతూ విధ్వంసకర దాడులు చేయగలవు.

ఈ జలాంతర్గాములు నీటి అడుగున కొన్ని నెలలపాటు ఉండగలవు. అంతేకాదు ఇవి సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించగలవు.

ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వర్చువల్ ప్రెస్‌ కాన్ఫెరెన్స్ ద్వారా వెల్లడించారు.

అయితే, వీరు నేరుగా చైనా పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ ప్రాంతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆకుస్

చైనా ఆందోళనకు కారణాలేంటి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, కుదరిన అత్యంత శక్తిమంతమైన రక్షణ ఒప్పందాల్లో ఇదీ ఒకటని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఒప్పందం తర్వాత, తొలిసారిగా ఆస్ట్రేలియా అమ్ముల పొదిలోకి అణు జలాంతర్గాములు వచ్చి చేరబోతున్నాయి. అంటే, అణు జలాంతర్గాములు కలిగిన ఏడో దేశంగా ఆస్ట్రేలియా మారనుంది.

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, రష్యాల వద్ద మాత్రమే ఈ జలాంతర్గాములు ఉన్నాయి. తాజా ఒప్పందంలో కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ పార్ట్‌నర్‌షిప్ కూడా భాగంగా ఉన్నాయి.

''చైనా దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా మూడు దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి’’అని ఆసియా సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాకు చెందిన గౌ బోకెన్‌స్టీన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ''చైనా క్రమంగా తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. అందుకే ఈ ప్రాంతంలోని మా మిత్రదేశాలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’’అని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వెల్లేస్ వ్యాఖ్యానించారు.

దక్షిణ చైనా సముద్రంలో సైనిక సామర్థ్యాన్ని చైనా క్రమంగా పెంచుకుంటూ వస్తోంది అదే సమయంలో ఈ ప్రాంతంలోని తమ భాగస్వాములైన జపాన్, దక్షిణ కొరియాల్లో సైనిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.

ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యం పెరిగేందుకు, తాజాగా ఆస్ట్రేలియాకు బదిలీచేస్తున్న అణు జలాంతర్గాముల సాంకేతిత దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా, చైనా

ఆస్ట్రేలియా-చైనా సంబంధాలు ఇలా..

ఆస్ట్రేలియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొన్నేళ్ల ముందువరకు సజావుగానే సాగేవి.

అయితే, ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న రాజకీయ విభేదాలతో రెండు దేశాల బంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

ముఖ్యంగా వీగర్ ముస్లింల అణచివేతపై విమర్శలు, హువావే సాంకేతికతపై ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తిలో చైనా పాత్రపై విచారణ తదితర ఆస్ట్రేలియా చర్యలపై రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

ఈ ఒప్పందంపై తమకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై యూరోపియన్ యూనియన్ కూడా ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

''ఈ ఒప్పందంపై మాకు ఇప్పుడే సమాచారం అందింది. దీనిపై మాతో ఎలాంటి చర్చలూ జరపలేదు. మాకు దీని గురించి అసలు తెలియనేలేదు. ఇది ఏదో ఒక రాత్రిలో కుదిరిన ఒప్పందం కాదు. దీన్ని కుదుర్చుకునేందుకు చాలా సమయం పడుతుందని మాకు తెలుసు’’అని యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, విదేశీ విధానాల ప్రతినిధి జోసెప్ బరెల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What is the AUKUS Agreement? Why is France angry with US and Australia? Why is China afraid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X