వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోప్ అలెగ్జాండర్ VII వర్ణ చిత్రం

ఫాబియో చిగి విద్యావంతుడు, కళలు, నిర్మాణ సాంకేతికతపై ఆయనకు ఆసక్తి ఉండేది. తత్వ శాస్త్రం, వేదాంతం, న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు.

కానీ, పోప్ అలెగ్జాండర్ VII అవగానే, తనకు ఏమాత్రం అవగాహన లేని ఒక మహమ్మారిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ, అత్యంత కష్ట సమయంలో ఈ కాథలిక్ చర్చి అధిపతి, ఏ మాత్రం తొణక్కుండా రోమ్‌లో లాక్ డౌన్ విధించాలనే నిర్ణయానికి వచ్చారు.

ఆయన అప్పుడు చేపట్టిన ఆ చర్యలతో నగరంలో మిగతా ప్రాంతాల్లో కంటే చాలా తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయని, లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగారని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇటలీలో ప్లేగు వ్యాపించినప్పుడు పరిస్థితి. ఆయిల్ పెయింటింగ్

ప్లేగ్ , మరణాలు, నిబంధనలు

1599లో జన్మించిన ఫాబియో చిగి 1667లో మరణించారు.

అయితే, ఆ సమయంలో వ్యాపించిన ప్లేగ్ వ్యాధి గురించి ఎక్కడా పెద్దగా సమాచారం లేదు.

1894లో అలెగ్జాండరే ఎర్సిన్ ప్లేగ్‌కి కారణమైన వైరస్‌ను కనిపెట్టేవరకూ దాని గురించి ఎవరికీ తెలీదు.

ఈ ప్లేగ్ కేవలం ఆధునిక ఇటలీని మాత్రమే కాకుండా యూరోప్‌లో సుమారు సగం జనాభాను పొట్టన పెట్టుకున్నట్లు అంచనా వేస్తారు.

"1656 - 1657 మధ్య కాలంలో వచ్చిన ఈ ప్లేగ్ సార్దీనియాలో 55 శాతం జనాభాను, నేపుల్స్‌లో సగం జనాభాను, జెనోవాలో 60 శాతం మంది ప్రాణాలు తీసిందని ఇటలీ చరిత్రకారుడు సాపిఎంజా చెప్పారని" యూనివర్సిటీ ఆఫ్ రోమ్ ప్రొఫెసర్ లూకా టోపీ అధ్యయనంలో తేలింది.

కానీ, అప్పుడు రోమ్ నగరంలో ప్లేగ్ వల్ల 8 శాతం కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయి. నగరంలోని లక్షా 20 వేల జనాభాలో, 9,500 మంది చనిపోయారని 2017లో ఇటాలియన్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైన సమాచారం చెబుతోంది.

నేపుల్స్‌లో ప్లేగ్ వ్యాపించిన సమయానికి, అలెగ్జాండర్ VII చర్చికి అధికారి అయ్యి ఒక సంవత్సరం కావస్తోంది.

వాటికన్ సిటీ పెయింటింగ్

1656 మే - 1657 ఆగష్టు మధ్య కాలంలో ఈ మహమ్మారి వచ్చినపుడు, ప్రస్తుతం కరోనావైరస్ సమయంలో ఎలాంటి నిబంధనలు విధించారో అలాటివే అమలు చేసారు.

ఈ పోప్ కాథలిక్ క్రైస్తవులకు మాత్రమే నాయకుడు కాదు.

వాటికన్‌తోపాటూ రోమ్ చుట్టు పక్కల, అనేక చిన్న చిన్న రాష్ట్రాలను కూడా ఆయన పాలించారు. దానినే ఇప్పుడు సెంట్రల్ ఇటలీగా చెబుతున్నారు.

రోమ్‌లో ఒక్కొక్క నిబంధననూ అమలు చేస్తూ వచ్చిన పోప్ అలెగ్జాండర్ VII నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి దిగజారుతుండటంతో మెల్లగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

మే 20 నాటికి నేపుల్స్ రాజ్యంతో ఉన్న వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు. వారం రోజుల తర్వాత నేపుల్స్ నుంచి రోమ్ వచ్చే ప్రయాణీకులను ఆపేసారు.

మే 29న పాపల్ రాష్ట్రంలోని సివిటవేక్కియ పట్టణంలో తొలి ప్లేగ్ కేసు నమోదు అయింది. అక్కడ వెంటనే క్వారంటైన్ నిబంధనలు అమలు చేశారు.

"ఆ తర్వాత కొన్ని నెలల పాటు చాలా ప్రాంతాలను ఐసొలేట్ చేసారు. రోమ్‌లో అయితే, నగరానికి ఉన్న అన్ని ద్వారాలు మూసేసారు" అని టోపీ చెప్పారు.

కేవలం 8 ద్వారాలను మాత్రమే తెరిచి, అక్కడ 24 గంటలూ సైనికులను కాపలా పెట్టారు. వాటిని నగరంలోని అధికారులు, చర్చి అధిపతి పర్యవేక్షించేవారు.

అప్పటి నుంచి అధికారులు నగరంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ, ప్రవేశ అనుమతి ఉందో లేదో తనిఖీ చేసి, వారి రాకపోకలను నమోదు చేసేవారు.

రోమ్‌లో జూన్ 15న తొలి ప్లేగ్ కేసు నమోదయింది. ఈ వ్యాధితో నెపోలియన్ సైనికుడు ఒకరు ఆసుపత్రిలో మరణించారు.

దాంతో, నిబంధనలను మరింత కఠినం చేశారు. జూన్ 20 నుంచి ప్లేగ్ రోగుల వివరాలను అధికారులకు తెలియజేయాలనే నిబంధన అమలు చేశారు.

ఆ తర్వాత మతాధికారి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇంటింటికీ వెళ్లి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో చూసి, వారి వివరాలను అధికారికంగా నమోదు చేసేవారు.

పోప్ అలెగ్జాండర్ VII

17వ శతాబ్దంలో లాక్ డౌన్

ఇంతలో రోమ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న ట్రస్టివీర్‌లో ఒక జాలరి ఈ వ్యాధితో మరణించాడనే వార్తలు వచ్చాయి.

"అతడి బంధువుల్లో కూడా చాలా మంది ప్లేగు వ్యాధి సోకి మరణించారు" అని బ్రెజిల్ పోంటిఫిషియల్ కాథలిక్ యూనివర్సిటీలో థియాలజీ చదివే రేల్సన్ అరౌజో చెప్పారు.

దాంతో, ముందుగా ఆ ప్రాంతాన్ని సీల్ చేసే చర్యలు చేపట్టారు.

"ఈ మహమ్మారి వ్యాపిస్తుండడంతో పోప్ మరిన్ని నిబంధనలను విధిస్తూ, భౌతిక దూరం పాటించాలనే నియమాలను జారీ చేశారు. సమావేశాలు, మత సంబంధమైన ఊరేగింపులు, ఇతర బహిరంగ ప్రదర్శనలను నిషేధించారు" అని అరౌజో చెప్పారు.

దౌత్యపరమైన రాకపోకలను కూడా రద్దు చేశారు. రహదారులను కూడా పర్యవేక్షించినట్లు చెప్పారు.

వీధుల్లో వస్తువుల అమ్మకాలు నిలిపివేశారు. ఇళ్లు లేని వారిని ఊరి బయటకు పంపేశారు.

"రాత్రి పూట టైబర్ నదిని దాటడాన్ని నిషేధించారు. ఒక వేళ ప్రజలు వ్యాధి బారిన పడినా, వారు బలంగా ఉండానికి పోప్ ఉపవాసాలు చేయడంపై కూడా నిషేధం విధించారు, వారు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు" అని సావ్‌పావులో, సావ్ బెంటో మొనాస్టరీ తత్వవేత్త గుస్తవో కటానియా చెప్పారు.

సెయింట్ పీటర్ స్క్వేర్

ఇన్ఫెక్షన్ సోకిన ఇంట్లోని సభ్యులు బయటకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు.

"మతాధికారుల వల్ల ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందేమోననే ఆందోళన కూడా ఉండేది" అని అరౌజో చెప్పారు.

దాంతో, రోగులకు దగ్గరగా వెళ్లేవారిని, వెళ్లని వారిని రెండు వర్గాలుగా చేసిన పోప్ అలెగ్జాండర్ VII మతాధికారులను, వైద్యులను రెండు వేర్వేరు బృందాలుగా వేరు చేశారు.

"ఆయన డాక్టర్లు రోమ్ వదిలి బయటకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు. క్వారంటైన్‌లో ఉన్న వారి కోసం సహాయక బృందాలను ఏర్పాటు చేసారు" అని కటానియా చెప్పారు. .

"ఇళ్లు వదిలి బయటకు వెళ్లని వారికి కోసం ఆర్ధిక సాయం కూడా అందిచారు. కొంత మందికి కిటికీల్లో నుంచి ఆహారం సరఫరా చేశారు" అని తెలిపారు.

లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించినవారికి కొన్ని సార్లు మరణ శిక్ష కూడా విధించారు.

రోమ్‌లో నిరసన ప్రదర్శనలు

ఫేక్ న్యూస్

ఇప్పుడు చాలా మంది కరోనా మహమ్మారి లేదని చెబుతున్నట్లే, అప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ, కొందరు ఆ వార్తలను ఖండించేవారు. కొంత మంది నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సమాచారం కూడా ప్రచారం చేసారు.

"పోప్ తనకు పేరు తెచ్చుకోడానికే, తప్పుడు మహమ్మారిని సృష్టించారని విమర్శలు చేసారు. ప్రజలను భయపెట్టడానికి మతాధికారి ఇలాంటి కఠినమైన చర్యలు చేపట్టడాన్ని ఖండించారు" అని పోంటిఫిషియల్ గ్రెగోరియన్ రోమ్ యూనివర్సిటీ పరిశోధకుడు మిర్టిసెలి మీడియోరిస్ చెప్పారు.

ఈ పరిస్థితిలో ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని పోప్‌ని సమర్ధించే వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఆధునిక కాలంలో ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారానికి, 17వ శతాబ్దంలో కొట్టి పారేసిన వాదనలకు పెద్దగా తేడా లేదని అరౌజో అన్నారు.

"వ్యాపారాలు కూడా నష్టపోతుండడంతో మరిన్ని నిబంధనలను విధించవద్దని కోరుతూ చాలా మంది వర్తకులు పోప్‌కి విన్నపం కూడా చేశారు" అని అరౌజో చెప్పారు.

"పోప్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినవని ఒక డాక్టర్ కూడా ప్రచారం చేసినట్లు వార్తలు ఉన్నాయి. ఆయనపై పరువు నష్టం కేసు వేసి, ఆ డాక్టర్ ప్లేగ్ ఆసుపత్రిలో పనిచేయకుండా అడ్డుకున్నారు" అని బ్రసిలియా, మెకంజీ ప్రెస్బిటేరియన్ కాలేజీ ప్రొఫెసర్ విక్టర్ మిస్సియాటో చెప్పారు.

కానీ, వీటిలో చాలా చర్యలను వ్యాధి వ్యాపించకుండా అడ్డుకోవడం కోసమే అమలు చేశారు.

వాటికన్‌ దగ్గర బెర్నినీ కొలొన్నేడ్

ప్లేగ్ పై పోరాటం

1657లో ఈ మహమ్మారి అంతం కావడంతో ఆ సందర్భాన్ని అలెగ్జాండర్ ఘనంగా జరుపుకున్నారు.

దానిని 'చర్చి పునర్జన్మ'గా పేర్కొంటూ కొత్త భవనాలు, స్మారక చిహ్నాలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసారు.

వాటిలో సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో నిర్మించిన మండపం, అన్నిటి కంటే అద్భుతమైన కట్టడంగా నిలిచింది. ఇది చర్చి చేతులు చాచినట్లుగా ఉంటుంది. దీనిని బరోక్ అనే శిల్పి, జియాన్ లొరెంజో బెర్నిని రూపొందించారు.

పోప్ అధికారాన్ని, కీర్తిని ప్రదర్శించడానికి ఆ రోజుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం ఒక పద్ధతిగా ఉండేది.

పోప్ అలెగ్జాండర్‌ కళలపై తనకున్న మక్కువను కళాత్మక కట్టడాల నిర్మించడం ద్వారా తీర్చుకున్నారు.

కలరా మహమ్మారి సమయంలో ఇటలీలోని ఒక మార్కెట్ చిత్రం

ఇదొక్కటి మాత్రమే కాదు

అయితే, అప్పటి లాక్ డౌన్‌ల గురించి చెప్పడానికి ఉన్న ఉదాహరణ ఇదొక్కటి మాత్రమే కాదు.

"19 వ శతాబ్దంలో కలరా వ్యాధి ప్రబలినప్పుడు కూడా, ఇటలీలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్‌లు లను విధించారు" అని మీడియోరోస్ చెప్పారు.

16వ శతాబ్దంలో మిలన్‍‌లో ప్లేగ్ వ్యాపించినప్పుడు ఆర్క్ బిషప్ కార్లో బొర్రోమియో కూడా కఠినమైన లాక్ డౌన్ విధించారు.

నమ్మకం, శక్తి, సైన్సు

400 సంవత్సరాల క్రితం సైన్సుకి ప్రస్తుతం ఉన్నంత విలువ లేదు.

17వ శతాబ్దంలో యూరప్‌లో సాధారణంగా రాజుకు పూర్తి అధికారాలు ఉండేవి. ఈ అధికారం చర్చితో అనుసంధానం అయి ఉండేది.

రాజకీయ, ఆధ్యాత్మిక శక్తులు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేవని మిస్సియాటో చెప్పారు.

"అప్పటికి శాస్త్రీయ విప్లవం రాలేదు. భగవంతుడిపై నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. భక్తి మాత్రమే ముక్తికి మార్గమని భావించేవారు" అని మిస్సియాటో అన్నారు.

అందుకే అప్పట్లో అలెగ్జాండర్ VII తీసుకున్న చర్యలకు చాలా ప్రాధాన్యం లభించింది.

"సైన్స్‌కి, నమ్మకానికి మధ్య ఉన్న తేడాను అవి చూపించాయి. ఇవి ఒక గట్టి నమ్మకంతో దృఢ చిత్తంతో తీసుకున్న నిర్ణయం" అని అరౌజో అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the history of lockdown,Why was it imposed in Rome 400 years ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X