బార్‌లో పరిచయం.. బిలియన్ల డాలర్ల వ్యాపారం.. జెన్సన్ హువాంగ్ వివాదంలో ట్విస్ట్!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ తయారీ సంస్థ 'ఎన్విడియా' సీఈవో జెన్సన్ హువాంగ్(63) ఓ చైనా వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు అంగీకరించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా నిఘా వర్గాలు సదరు మహిళను చైనా గూఢచారిగా అనుమానించడంతో ఎన్విడియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వివాదం కేంద్రంలో ఉన్న మహిళ పేరు ఆలిస్ హువాంగ్.
ఎవరీ ఆలిస్ హువాంగ్? నేపథ్యం ఏంటి?
ఆలిస్ హువాంగ్ చైనా పౌరురాలు. ఆమె సింగపూర్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ డేటా సెంటర్ కంపెనీ 'మెగాస్పీడ్'లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. చైనా ప్రైవేట్ ఫండ్ డేటాబేస్‌లోని వివరాల ప్రకారం.. ఆమె గతంలో హునాన్ టీవీ, ప్రభుత్వ ఛానల్ సీసీటీవీలలో టీవీ రిపోర్టరుగా పనిచేశారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి మారి హెస్ఎస్బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగంలో, అనంతరం సీఐటీఐసీ సెక్యూరిటీస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. అయితే ఆమె సీసీటీవీలో పనిచేసినట్లు అధికారిక రికార్డులు ఏవీ లభించకపోవడం గమనార్హం.

జెన్సన్ హువాంగ్‌తో పరిచయం
జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ ఇద్దరి ఇంటిపేరు ఒకటే అయినప్పటికీ వారిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. వీరిద్దరూ మొదటిసారి జూన్ 2024లో తైపీలోని ఓ బార్‌లో కలిసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత మే 2025లో తైపీలోని ఓ రెస్టారెంట్ బయట జెన్సన్ హువాంగ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఆయన వెనకాలే నిలబడి కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె జెన్సన్ హువాంగ్ తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని, ఎన్విడియా వ్యాపార వ్యూహాలు, అమెరికా విధించిన చిప్ ఎగుమతి ఆంక్షల నుంచి మినహాయింపులు పొందే ప్రణాళికల వివరాలను చైనా నిఘా సంస్థ అయిన 'మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ'కి చేరవేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.
4.8 బిలియన్ డాలర్ల చిప్ వ్యాపారం
ఆలిస్ హువాంగ్ నాయకత్వంలోని 'హువాంగ్ లే లిమిటెడ్' నేతృత్వంలో స్థాపించబడిన మెగాస్పీడ్ కంపెనీ గత రెండేళ్లలో ఎన్విడియా నుంచి దాదాపు 4.8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.40 వేల కోట్లు) విలువైన ఏఐ చిప్స్‌ను కొనుగోలు చేసింది. ఆసియా ఖండంలో ఎన్విడియా ఉత్పత్తులను కొనుగోలు చేసే అతిపెద్ద కంపెనీల్లో మెగాస్పీడ్ ఒకటిగా మారింది. ఈ భారీ వ్యాపార డీల్స్ అమెరికా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించడంతో రహస్యంగా దర్యాప్తు చేపట్టి ఈ విషయాలను వెలుగులోకి తెచ్చాయి.
డొనాల్డ్ ట్రంప్, మార్కో రుబియో స్పందన
ఈ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ జెన్సన్ హువాంగ్‌కు మద్దతు తెలిపారు. "జెన్సన్ చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన దేశానికి ఆయన ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. దీనిపై అమెరికా యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తోంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఇది ఎన్విడియా కంపెనీ అంతర్గత వ్యవహారమని, నిఘా కోణంలో ఉన్నందున ఈ విషయంపై మాట్లాడలేమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
