వైసీపీకి ఛాన్స్ దొరికింది అక్కడే- ఆ రెండు కారణాలు- ఆ ఒక్క పని చేసుంటే..?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ (YSRCP) ఆ తర్వాత తిరిగి పుంజుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అయినా స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ పుంజుకుంటుందన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరికి జగన్ తీవ్ర హెచ్చరికలు చేసినా.. వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం చాలా నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్ని లైట్ తీసుకున్నారు. అయినా వైసీపీ పరిషత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. కూటమి గెలుపుతో పోలిస్తే ఈ ఫలితాలు చిన్నవే అయినా చాలా చోట్ల లెక్కలు మారాయన్న సంగతి అందరికీ అర్దమవుతోంది.
తాజా ఎన్నికల్లో వైసీపీ 1711 ఎంపీటీసీ స్ధానాల్ని, 76 జడ్పీటీసీ స్ధానాల్ని గెల్చుకుంది. మామూలుగా చూస్తే.. పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్ధానాల్ని గెల్చుకున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా గెలిచామని అనిపించాయి. కానీ వాటిలో చాలా చోట్ల ఏకపక్షంగా సాగాల్సిన ఎన్నికల్ని పోటాపోటీగా మార్చేసిన వైసీపీ.. ఇందులో కొన్ని చోట్ల గెలిచి, మరికొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు దాదాపుగా కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా అంగీకరిస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. అవి ఒకటి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అలాగే కూటమి పొత్తుల్లో లోటుపాట్లు. ఈ రెండు కారణాలు రాష్ట్రంలో ఇప్పుడు గ్రామ స్థానిక సంస్థల్లో వైసీపీ తిరిగి పుంజుకునేందుకు అవకాశం కల్పించాయి.

రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు తీయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి. సంక్షేమంలో అమలు కాని రెండు సూపర్ సిక్స్ హామీలు నిరుద్యోగ భృతి, నెలకు 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరికొన్ని చిన్న పథకాలు, హామీలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మొదలైన భోగాపురం పోర్టు, ఇతర ప్రాజెక్టులు పూర్తి కావడం మినహా కూటమి కొత్తగా ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టులు లేవు. అయినా వీటికి మించి ఎమ్మెల్యేల అవినీతి, పొత్తుల్లో స్దానికంగా విభేదాలు తలెత్తడం వైసీపీకి ప్లస్ అయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే వైసీపీ ఈ ఎన్నికల్ని మరింత సీరియస్ గా తీసుకుని, డబ్బులు కూడా ఖర్చుపెట్టి ఉంటే కచ్చితంగా కూటమితో సై అంటే సై అనేలా ఫలితాలు వచ్చి ఉండేవన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకునేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశం కల్పించాయి.














Click it and Unblock the Notifications
