Ramzan Kadyrov: రష్యా వదిలిన మరో అస్త్రం-ఉక్రెయిన్ పోరులో కీలక పాత్ర-యుద్ధం కంటే..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. నెల రోజులు దాటిపోయినా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్దితి. మరోవైపు రష్యాకు ఈ యుద్ధంలో భారీ ఎదురుదెబ్బలు కూడా తప్పడం లేదు. అయితే యుద్దంలో ఓ పేరు మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. అతడే రంజాన్ కదిరోవ్. చెచెన్యా అధ్యక్షుడైన కదిరోవ్.. రష్యాకు మద్దతుగా యుద్ధంలోకి దిగినా అక్కడ ఆయన పోషిస్తున్న మానవతా పాత్ర ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కుతోంది.

రష్యాకు అండగా చెచెన్యా అధినేత
ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధంలో ఆరంభంలో భారీగానే ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. తమ ఆధీనంలోనే ఉన్న చెచెన్యా నుంచి వాలంటీర్ల సాయం కోరాడు. దీంతో చెచెన్యా అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్.. భారీ సంఖ్యలో వాలంటీర్లను తీసుకుని యుద్ధ రంగంలోకి దిగారు. అక్కడ వాస్తవానికి కదిరోవ్ రష్యాకు అండగా నిలుస్తూ ఉక్రెయిన్ పై దాడులకు దిగుతారని అంతా ఆశించారు. కానీ ఆయన మాత్రం విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు.

పుతిన్ వదిలిన బాణం కదిరోవ్
చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇచ్చిన టార్గెట్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ఉక్రేనియన్ నాయకత్వాన్ని తటస్థీకరించడం, తిరుగుబాటును ఆపడం వంటివి ఇందులో కొన్ని మాత్రమే. అయితే పుతిన్ మానసిక యుద్ధ ప్రచారంలో కదిరోవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే యుద్ధం కంటే మానసికంగా ఉక్రెయిన్లను లొంగదీసుకునేందుకు ఆయన వారికి మానవతాసాయాన్ని ఎరగా చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కదిరోవ్ పోషిస్తున్న పాత్ర కూడా యుద్ధంలో చర్చనీయాంశంగా మారుతోంది.

అసలు ఎవరీ కదిరోవ్ ?
రంజాన్ కదిరోవ్ ప్రస్తుతం చెచెన్ రిపబ్లిక్ కు అధ్యక్థుడు. కదిరోవ్ తన తండ్రి, మాజీ చెచెన్ అధ్యక్షుడు అఖ్మద్ కదిరోవ్ హత్యకు గురైన మూడేళ్ల తర్వాత 2007లో అధికారంలోకి వచ్చాడు. వీరిద్దరూ మొదటి చెచెన్ యుద్ధంలో (1994-96) స్వాతంత్ర్య అనుకూల దళాల పక్షాన పోరాడారు, కానీ రెండవ చెచెన్ యుద్ధంలో (1999-2000) రెండు వైపులా మారారు. అలాగే రష్యన్ సైన్యం వారిని ఓడించడంలో సహాయపడ్డారు. ఫలితంగా, చెచెన్యా స్వల్పకాలిక స్వాతంత్ర్యం కోల్పోయింది. దీంతో రష్యన్ ఫెడరేషన్ యొక్క ప్రాంతాలలో ఒకటిగా మారింది.ఆ తర్వాత రష్యన్ సైన్యం పాల్గొన్న సంఘర్షణలకు చెచెన్ దళాలు మోహరిస్తున్నాయి. జార్జియాలో 2008 యుద్ధం, 2014-15లో ఉక్రెయిన్‌లో మొదటి దశ మరియు సిరియన్ యుద్ధంలో కూడా చెచెన్యా దళాలు రష్యాకు అండగా ఉన్నాయి.

సాయం ముసుగులో మానసిక యుద్దం ?
ఉక్రెయిన్ యుద్ధానికి రంజాన్ కదిరోవ్ ను పుతిన్ పిలిపించిందే తనకు సాయం చేయడానికి. పుతిన్ కు సాయం చేయకుండా కదిరోవ్ కూడా ఈ యుద్ధం నుంచి వెనక్కి వెళ్లే పరిస్ధితి కూడా లేదు. కానీ కదిరోవ్ కానీ అతను వెంట తెచ్చుకున్న చెచెన్ వాలంటీర్లు కానీ యుద్ధంలో ఎక్కడా పాల్గొన్న ఆనవాళ్లు కనిపించడం లేదు. మరి వారంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటే మానసిక యుద్ధంలో పాల్గొంటున్నారని చెప్పక తప్పదు. ఉక్రెయిన్ యుద్ధంలో బాధితులుగా మారుతున్న వారికి మానవతా సాయం చేస్తున్నామనే నెపంతో రష్యాకు లొంగిపోయేలా ఉక్రెయిన్ మానసిక ఒత్తిడి తెచ్చేందుకు కదిరోవ్ ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. కదిరోవ్ తీరు చూస్తుంటే గతంలో జరిగిన యుద్ధాలకు భిన్నంగా కొత్త అస్త్రంలా కనిపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications