వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు, భారత్ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరుగుతున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బంగ్లాదేశ్‌లో హింస

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ జరుగుతున్న మండపాలపై, ఆలయాలపై దాడి తర్వాత శుక్రవారం రాజధాని ఢాకా, నోవాఖాలీలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.

ఢాకాలోని బైతుల్ ముదరమ్ మసీదు, కకరైల్ ప్రాంతంలో, నోవాఖాళీ చౌమూహనీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఈ ఘర్షణలు జరిగాయి.

దీనితోపాటూ నోవాఖాలీలోని బేగమ్‌గంజ్‌, చౌముహనీలో హిందువుల ఇళ్లు, షాపులను కూడా లక్ష్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ ఘర్షణల్లో జతన్ కుమార్ సాహా అనే ఒకరు చనిపోయినట్లు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ధ్రువీకరించారు.

ఢాకాలో నిరసన ప్రదర్శనల్లో 'మలిబాగ్ ముస్లిం సమాజ్' అనే పోస్టర్ పట్టుకుని ఉన్నారు. ఇక చౌమూహనీలో జరిగిన నిరసనల్లో 'తౌహిది జనతా' పోస్టర్లు కనిపించాయి.

నిరసనకారులు భారత వ్యతిరేక నినాదాలు చేశారని, ప్రధాని హసీనా న్యూదిల్లీకి చాలా దగ్గరవుతున్నారని ఆరోపించారని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

చౌముహనీలో ఒక కారుకు నిప్పుపెట్టారు

కొమిల్లా జిల్లాలో ఖురాన్‌కు అవమానం జరిగిందనే ఆరోపణలతో ఢాకా, చౌమూహనీలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. తర్వాత అవి హింసాత్మకంగా మారాయి.

కొమిల్లాలో బుధవారం ఒక పూజా మండపం దగ్గర ఖురాన్‌ను అవమానించారని ఆరోపణలు రావడంతో కొమిల్లా, చాంద్‌పూర్ సహా చాలా ప్రాంతాల్లో ఆలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగాయి.

నోవాఖాలీలోని బేగంగంజ్‌లో ఒక పూజా మండపానికి నిప్పు పెట్టడం, చాంద్‌పూర్‌ హాజీగంజ్‌లో ఘర్షణల్లో కనీసం నలుగురు మృతి చెందారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం 22 జిల్లాల్లోని భద్రతా బలగాలను మోహరించింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిని శిక్షిస్తామని గురువారం ప్రధాని షేక్ హసీనా చెప్పారు.

మరోవైపు, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి దేశవ్యాప్తంగా 4జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

బంగ్లాదేశ్‌లో హింస

హింస ఎలా మొదలైంది

ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం బైతుల్ ముకరమ్‌లో శుక్రవారం ప్రార్థనలు పూర్తి కావడానికి ముందు ఒక గ్రూప్ నినాదాలు చేయడం ప్రారంభించింది.

నిరసనకారులు ర్యాలీ ప్రారంభించినపుడు, పోలీసులు వారిని మసీదు తలుపు దగ్గరే ఆపడంలో విఫలమయ్యారు. దాంతో ఆ ర్యాలీ పాల్టన్ చేరింది. అది విజయ్‌నగర్ వరకూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోలేకపోయారు.

కక్‌రైల్ జంక్షన్లో బారికేడ్లు పెట్టిన పోలీసులు నిరసనకారులను మూడు వైపుల నుంచీ అడ్డుకున్నారు. కానీ అక్కడి నుంచే హింస మొదలైంది.

పోలీసులు అడ్డుకోవడం, తమను పట్టుకోడానికి ప్రయత్నించడంతో నిరసనకారులు వారిపై రాళ్లు వసిరారు. దాంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు.

పోలీసులు, నిరసనకారుల మధ్య శుక్రవారం మొదట 10- 15 నిమిషాలు ఘర్షణ జరిగిందని, కానీ, ఆ తర్వాత అది అరగంటపాటు కొనసాగిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

మధ్యాహ్నం 2.15 తర్వాత ఆర్ఏబీ భద్రతా బలగాలు వచ్చాయి. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు పోలీసులు గాయపడ్డారని ఒక ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో హింస

నోవాఖాలీ చౌముహనీలో ఘర్షణలు

సాయంత్రం 4 గంటలకు తాను పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినట్లు నోవాఖాలీలోని ఒక పోలీస్ అధికారి బీబీసీతో చెప్పారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత 'తౌహీదీ జనతా' బ్యానర్ పట్టుకున్న గుంపు నిరసనలు చేపట్టిందని, ఆ ర్యాలీలో ఉన్న వారు తర్వాత కాలేజ్ రోడ్‌లోని ఒక పూజా మండపంపై దాడి చేశారని స్థానికులు చెప్పారు.

అయితే, ఆ మండపంలో విగ్రహాన్ని ఉదయమే తొలగించడంతో, అక్కడ ఆ సమయానికి హిందువులు ఎవరూ లేరు.

ఆ తర్వాత నిరసనకారులు హిందువుల ఇళ్లు, షాపులపై దాడి చేయడంతో పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు చేపట్టారు.

ఈ దాడుల్లో జతన్ కుమార్ సాహా అనే వ్యక్తి చనిపోయినట్లు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ షా ఇమ్రాన్ బీబీసీ బంగ్లాకు చెప్పారు.

గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బేగంగంజ్ చయానీ బజార్‌లో ఉన్న ఒక దుర్గా పూజ మండపానికి నిప్పు పెట్టారు.

నిరసనకారులు ఇఖ్లాస్‌పూర్‌లోని మరో ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారని ఉప జిల్లా నిర్బాహి అధికారి షంసూన్ నాహర్ చెప్పారు.

బంగ్లాదేశ్‌లో హింస

చిట్‌గావ్‌లో ఆలయాలపై దాడికి ప్రయత్నం

చిట్‌గావ్‌లో చాలా ఆలయాలు, మండపాలపై దాడి చేసే ప్రయత్నం జరిగిందని హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఏక్తా పరిషత్ రాణా దాస్ గుప్తా ఆరోపించారు.

"శుక్రవారం ప్రార్థనల తర్వాత చిట్‌గావ్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ర్యాలీ సమయంలో చాలా ప్రాంతాల్లో మండపాలపై దాడులకు ప్రయత్నించారు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఈ నిరసన ప్రదర్శనల కారణంగా దుర్గా విగ్రహాల నిమజ్జనం నిలిపివేశామని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్‌లో హింస

భారతదేశం ఏమంటోంది?

బంగ్లాదేశ్‌లో ఒక ఇస్కాన్ ఆలయంలో కూడా ఒక గుంపు విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో ఒక భక్తుడు చనిపోయాడు. దీంతో గురువారం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

ఈ ఘటనలను మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి సమన్వయంతో, ప్రణాళికా బద్ధంగా జరుగుతున్న దాడులుగా భారత్ వర్ణించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది.

దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో పారా మిలిటరీబలగాలను భారీగా మోహరించినా అంతకంతకూ పెరుగుతున్న ఈ ఘటనలను అడ్డుకోవడం లేదా నియంత్రించడంలో బంగ్లాదేశ్ విఫలమవడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిందని పత్రిక రాసింది.

నోవాఖాలీలోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన దాడితో అక్కడి హిందూ సమాజం షాక్‌లో ఉందని కూడా ఈ కథనంలో చెప్పారు.

బంగ్లాదేశ్‌లో రెండు సమాజాల మధ్య మత ఘర్షణలు జరగడం వెనుక ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల హస్తం ఉండే అవకాశం ఉందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని కొన్ని వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని పత్రిక రాసింది.

https://twitter.com/IskconInc/status/1449417698736160773?

ఇస్కాన్ ఆలయం దగ్గర చెరువులో శవం

ఇస్కాన్ ఆలయంలో విధ్వంసం గురించి ఆలయ నిర్వాహకులు ట్వీట్ చేశారు. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు.

"బంగ్లాదేశ్‌లోని నోవాఖాలీలో ఇస్కాన్ ఆలయంపై, భక్తులపై హింసాత్మక దాడులు జరిగాయి. ఆలయానికి చాలా నష్టం జరిగింది. ఒక భక్తుడి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది" అని చెప్పింది.

"పార్థ్ దాస్ ఒక భక్తుడు. ఆయన్ను నిన్న 200 మందితో ఉన్న ఒక గుంపు చంపేసింది. ఆయన శవం ఆలయం దగ్గరే ఉన్న ఒక చెరువులో దొరికింది" అని ఇస్కాన్ శనివారం మరో ట్వీట్ చేసింది.

https://twitter.com/IskconInc/status/1449246073478733827?

"హిందువులందరికీ భద్రత కల్పించేలా చూడాలని, కుట్రకు పాల్పడినవారిని శిక్షించాలని మేం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరాం" అని తెలిపింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశంలో పరిస్థితిపై రెడ్ అలర్ట్ జారీ చేసింది. మైనారిటీ హిందువుల దుర్గా పూజ మండపాల్లో హింసకు కారణమైన నిందితుల గురించి ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయని చెప్పింది.

బంగ్లాదేశ్‌లోని చాలా జిల్లాల్లో బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(బీసీబీ) పారా మిలిటరీ బలగాలను మోహరించారు. అవి దేశంలోని 64 జిల్లాల్లో 34 జిల్లాల్లో ఉన్నాయి.

గత మూడు రోజులుగా జరిగిన హింసాత్మక ఘటనలకు కారణమైన ప్రధాన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్ఏబీ) చెప్పింది.

బంగ్లాదేశ్‌లో హింస

ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తులో పురోగతి సాధిస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసద్ ఉజ్ జమా ఖాన్ కమాల్ మీడియాకు చెప్పారు.

"ఇది మత సామరస్యానికి భంగం కలిగించడానికి జరిగిన కుట్రగా కనిపిస్తోంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారు. మేం చట్టప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నాం. త్వరలో కొందరిని అరెస్ట్ చేస్తాం" అని ఆర్ఏబీ కల్నల్ కేఎం ఆజాద్ చెప్పారు.

కొమిల్లా జిల్లాలో హిందూ ఆలయాలు, దుర్గా పూజా మండపాలపై దాడుల తర్వాత ప్రధాన మంత్రి షేక్ హసీనా కఠిన హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటలకే ఈ హింసాత్మక ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.

"నిందితులు ఏ మతం వారైనా సరే, ఎవరినీ వదిలిపెట్టం. వెతికి పట్టుకుని, శిక్షిస్తాం" అని హసీనా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why are there attacks on Hindu temples and anti-India demonstrations in Bangladesh?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X