
కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశారు, ఆయన ప్లాన్ ఏమిటి?

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె వరుసగా వారంలో రెండో రోజు మీడియా ముందు కనిపించారు. దీంతో తన రాజకీయ వారసురాలిగా కూతురిని కిమ్ జోంగ్ పరిచయం చేయబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.
అయితే, ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఇప్పటికీ ఆమె పేరు లేదా వయసు లాంటి వివరాలు వెల్లడించలేదు. తమ ''ప్రియతమ నాయకుడి ముద్దుల కుమార్తె’’అని మాత్రమే పరిచయం చేస్తోంది.
హాస్వంగ్-17 క్షిపణి ప్రయోగానికి ముందుగా కిమ్ జోంగ్, తన కుమార్తెపాటు కలిసి వెళ్లి సైనికులు, శాస్త్రవేత్తలను కలిశారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ ఆదివారం వెల్లడించింది.
ఈ సమావేశం ఎప్పుడు జరిగిందో కేసీఎన్ఏ వెల్లడించలేదు. అయితే, కిమ్, ఆయన కుమార్తెకు ప్రజలు సంతోషంగా ఆహ్వానం పలికారని పేర్కొంది.
ఇంతకీ కిమ్ జోంగ్ కుమార్తె గురించి మనకు ఇప్పటివరకు ఏం తెలుసు?
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..

2013లో తొలిసారి..
ప్రపంచంలో అత్యధిక రహస్యాలకు నిలయమైన ఉత్తర కొరియాకు కిమ్ జోంగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీడియాకు చాలా కొంచెం మాత్రమే తెలుసు.
జులై 2012లో రీ సోల్-జును కిమ్ భార్యగా ఉత్తర కొరియా ధ్రువీకరించింది. కిమ్, ఆమె కలిసి మీడియా ముందుకు వచ్చిన నెల రోజుల తర్వాత, ఆమె కిమ్ భార్య అని ప్రకటించింది.
కిమ్, సోల్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారని దక్షిణ కొరియా మీడియాలో వార్తలు వచ్చాయి.
2013 సెప్టెంబరులో అమెరికాకు చెందిన మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ డేనిస్ రాడ్‌మన్ ఉత్తర కొరియాకు ''బాస్కెట్ బాల్ డిప్లమసీ టూర్’’కు వెళ్లారు. అప్పుడే కిమ్‌కు ఒక చిన్న పాప ఉందని బ్రిటిష్ వార్తా పత్రిక గార్డియన్‌కు ఆయన వెల్లడించారు.
''వారి పాప జూ-ఆయేను నేను ఎత్తుకున్నాను. కిమ్ భార్యతోనూ మాట్లాడాను. ఆయన మంచి తండ్రి, అది చాలా అందమైన కుటుంబం’’అని రాడ్‌మన్ చెప్పారు.
అయితే, రాడ్‌మన్ వ్యాఖ్యలను ఉత్తర కొరియా మీడియా ధ్రువీకరించలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు.
- ఉత్తర కొరియా: పంట పొలాల్లోకి సైన్యం.. ప్రతి బియ్యం గింజనూ సేకరించాలని కిమ్ ఆదేశం
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?

ప్రజల ముందుకు 2022లో..
19 నవంబరు 2022లో కిమ్ జోంగ్, ఆయన కుమార్తెతో కలిసి పర్యటిస్తున్న కొన్ని ఫోటోలను కేసీఎన్‌ఏ ప్రచురించింది. దీంతో అప్పటివరకు వచ్చిన ఊహాగానాలు నిజమేనని ధ్రువీకరణ ఇచ్చింది.
సీనియర్ అధికారులతో మాట్లాడటం, క్షిపణులను పరీక్షించడం, క్షిపణి ప్రయోగాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడం తదితర ఫోటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది.
అయితే, కిమ్ కుమార్తె పేరు గానీ లేదా వయసు గానీ ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు.
''ఉత్తర కొరియా విజయవంతంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందనే వార్త కంటే.. అసలు ఈమె ఎవరనే వార్తే ఉత్తర కొరియాలో విశ్లేషకుల్లో ఉత్సుకతను నింపింది’’అని బీబీసీ సియోల్ ప్రతినిధి జీన్ మెకెంజీ చెప్పారు.
''అంటే ఆమెను కిమ్ జోంగ్ తన వారసురాలిగా ప్రకటిస్తున్నారా? ఈమె ఉత్తర కొరియాను ఒక రోజు పాలించబోతున్నారా?’’అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని జీన్ మెకెంజీ వివరించారు.
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?

రెండోసారి మళ్లీ..
తండ్రి, కుమార్తెల ఫోటోలు మీడియాలో కనిపించిన తర్వాత మరికొన్ని ఫోటోలను కూడా కేసీఎన్ఏ ఆదివారం విడుదల చేసింది.
''ఈ ఫోటోలు చాలా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకొంటున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పక్కల ఈ తండ్రీ, కూతురు కనిపించారు’’అని యూఎన్ ఎన్‌బీసీతో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన నిపుణుడు అంకిత్ పాండా అంచారు.
అయితే, కిమ్‌కు ఆమె రాజకీయ వారసురాలని ఇప్పుడే చెప్పడం సరికాదని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర కొరియాలో మహిళా నాయకులపై పుస్తకం రాసిన దక్షిణ కొరియాకు చెందిన చున్ సు-జిన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా నాయకురాలిగా కిమ్ కుమార్తెను ఇక్కడి ఉన్నత వర్గాలు ఆమోదించే అవకాశాలు దాదాపుగా శూన్యం అని అన్నారు.
''వేరే జెండర్‌కు చెందిన వారిని ఆహ్వానించేందుకు వారు సిద్ధంగా లేరు. అయితే, తాను నియంతను మాత్రమే కాదు.. ఒక మంచి తండ్రిని కూడా అని చెప్పుకోవడానికే కిమ్ ఆమెను పరిచయం చేసి ఉండొచ్చు’’అని సుజిన్ అన్నారు.
''ఉత్తర కొరియాలో నాయకుడు కావడంలో జెండర్ అనేది చాలా ముఖ్యం’’అని ఉత్తర కొరియా నుంచి బయటకు వచ్చి సియోల్‌లో ఎవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూనిఫికేషన్ స్టడీస్ కోసం పనిచేస్తున్న హ్యూ ఎన్-ఏ చెప్పారు.
''అయితే, ఇక్కడ మహిళా నాయకులు లేరని చెప్పుకోవడానికి వీళ్లేదు. కొన్ని ఏళ్లుగా కొంతమంది మహిళా నాయకులు ఉత్తర కొరియా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించారు’’అని ఆయన అన్నారు.
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- ఉత్తర కొరియాలో గ్యాస్ మాస్క్‌లతో పరేడ్ ఎందుకు నిర్వహించారంటే...
కిమ్ యో-జాంగ్: శక్తిమంతమైన కిమ్ సోదరి
2020లో కిమ్ జోంగ్‌కు అనారోగ్యం చేసిందని వార్తలు వచ్చాయి. అప్పుడే ఆయన సోదరి కిమ్ యో-జాంగ్ దేశానికి నాయకత్వం వహిస్తారని వార్తలు ఊపందుకున్నాయి. కిమ్ పిల్లలు వయసుకు వచ్చేవరకు ఆమె నాయకురాలి పాత్రలో కొనసాగుతారని కొందరు నిపుణులు విశ్లేషించారు.
ఇక్కడి ప్రభుత్వంలో యో-జాంగ్ సీనియర్ నాయకురాలి పాత్ర పోషిస్తున్నారు. తమపై ఆంక్షలు విధించినందుకు దక్షిణ కొరియాను అవమానిస్తూ ఇటీవల ఆమె వ్యాఖ్యలు చేశారు.

అయితే, నేడు కిమ్ జోంగ్ కుమార్తె బయట కనిపించడంతో మరిన్ని ప్రశ్నలు పుట్టుకువస్తున్నాయని బీబీసీ ప్రతినిధి మెకెంజీ అన్నారు.
''ఆమెను ఇప్పుడే ఎందుకు మీడియాకు పరిచయం చేస్తున్నారు? ఆమె చాలా చిన్నది. ఆమెకు ఇప్పుడే బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారా? 38ఏళ్ల ఆయనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లాంటి ఊహాగానాలు నేడు ఊపందుకున్నాయి’’అని మెకెంజీ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)