వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ప్రభుత్వం స్పైడర్‌మ్యాన్ సినిమాను ఎందుకు నిషేధించింది? హాలీవుడ్ అంటే చైనాకు ఎందుకు పడదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గత ఏడాది డిసెంబరులో విడుదలైన "స్పైడర్‌మ్యాన్ - నో వే హోమ్" సినిమాను సినీ ప్రేమికులు విపరీతంగా ఆరాధించారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీసులో రికార్డులను సాధించి 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15 వేల కోట్ల) ఆదాయాన్ని సంపాదించింది.

కరోనా ప్రభావంతో దెబ్బ తిన్న సినీ పరిశ్రమకు ఈ సినిమా సాధించిన విజయం కొత్త ఆశను కలిగించింది.

కానీ, చైనాలో మాత్రం ఈ సినిమాను నిషేధించారు. చైనా సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఉండే వాటినన్నిటినీ చైనా ఇటీవల నిషేధిస్తోంది. కానీ, స్పైడర్ మ్యాన్ సినిమాలో చైనా విలువలను భంగపరిచే విధంగా ఏమీ లేదు. ఈ సినిమాలో కనీసం చైనా ప్రస్తావన కూడా లేదు.

ఈ నేపథ్యంలో చైనాకు హాలీవుడ్‌కు మధ్య ఏమి జరుగుతోందనే ప్రశ్న ఉదయిస్తోంది.

చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిషేధించడం మాత్రమే కాకుండా వేరే ఎజెండా ఏమన్నా ఉందా? చైనా స్పైడర్‌మ్యాన్ సినిమాను ఎందుకు నిషేధించింది?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు బీబీసీ నలుగురు నిపుణులతో మాట్లాడింది.

మావో

చైనా, హాలీవుడ్

1949కి ముందు, చైనా సినీ పరిశ్రమ చాలా చిన్నది. దీని పరిధి ఏవో కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్ప చైనాలో నిర్మించే సినిమాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం, మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారాయి.

1951 నుంచి చైనాలో హాలీవుడ్, హాంగ్‌కాంగ్‌లో నిర్మించిన చిత్రాలను పూర్తిగా నిషేధించారు.

అప్పట్లో, చైనాలో సినిమాలను చూపించే వాహనాలు దేశవ్యాప్తంగా సంచరించేవి. ఈ సినిమాల్లో చూపించే రైతులు, కార్మికుల కథల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అంకిత భావం గురించి ప్రచారం చేసేవారు.

అప్పట్నుంచి మూడు దశాబ్దాల పాటు ఇలాంటి సినిమాలే చైనా సినీ ప్రపంచంలో ఆధిక్యం చూపించాయి.

గత 30 ఏళ్లలో చైనాలో ఒకే ఒక్క అమెరికా సినిమాను ప్రదర్శించినట్లు 'చైనాస్ ఎన్కౌంటర్ విత్ గ్లోబల్ హాలీవుడ్' రచయత వెండీ స్యూ రాశారు. 'సాల్ట్ ఆఫ్ ది ఎర్త్" అనే ఈ సినిమా గురించి ఎవరూ విని ఉండరు.

ఇది న్యూ మెక్సికోలోని గనుల్లో పని చేసే కార్మికుల జీవితాల ఆధారంగా తీసిన కథ.

కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈ సినీ నిర్మాతలను హాలీవుడ్ బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ సినిమా చైనాలో ప్రదర్శితమవ్వడానికి ఇదే ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.

1976లో మావో మరణం తర్వాత చైనా సినీ పరిశ్రమలో మలుపులు ఏర్పడ్డాయి.

కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ ప్రచార సాధనంగా మిగిలిపోయిన సినిమాకు కొంత స్వాతంత్య్రం లభించింది.

కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోవడంతో, చైనా సినీ పరిశ్రమ నిధుల కొరతతో ఇబ్బంది పడింది.

"చైనా సినీ పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉంది. చాలా స్టూడియోలు దివాలా తీశాయి. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు కూడా తగ్గిపోవడం మొదలయింది" అని వెండీ స్యూ వివరించారు.

చైనాలో ప్రేక్షకులు

సినిమాలు నిర్మించేందుకు నిర్మాతల దగ్గర నిధులు లేకపోవడంతో అధికారులు కొత్త సూచనలు చేశారు.

"హాలీవుడ్‌లో హిట్ సినిమాలను కొనవచ్చని ప్రభుత్వ ఫిల్మ్ బ్యూరోకు సలహా ఇచ్చారు. చైనాలో ప్రజలు కూడా ఈ సినిమాలను ఇష్టపడతారు. ఈ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ కు వెళితే, ఆదాయం వస్తుంది. ఈ డబ్బుతో, చైనాలో సినిమాలు నిర్మించేందుకు సహాయపడవచ్చు. అప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలను చైనాకు తేవడం మొదలయింది" అని వెండీ స్యూ చెప్పారు.

1994లో హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమా 'ది ఫ్యుగిటివ్' ను విడుదల చేశారు. ఇది భార్యను చంపిన ఆరోపణ తప్పని నిరూపించుకునే ఒక భర్త కథ.

ఈ సినిమాలో హ్యరిసన్ ఫోర్డ్, టామీ లీ జాన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చైనా ప్రేక్షకుల పై అద్భుతమైన ప్రభావం చూపించింది.

"హాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని చైనాలో ప్రేక్షకులు భావించారు. యాక్షన్ దృశ్యాలతో నిండిపోయి వేగంగా కదిలే సినిమా వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, వారికి ప్రపంచ సినిమాతో గత 30 ఏళ్లుగా పరిచయం లేదు.

ఇది చైనాలో ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమలోనే ఒక కొత్త శకానికి నాంది పలికింది.

కానీ, ప్రతీ సంవత్సరం కేవలం 10 హాలీవుడ్ సినిమాలను మాత్రమే స్క్రీన్ చేయాలని చైనా నిర్ణయించింది. ఈ సినిమాల నుంచి వచ్చిన ఆదాయం నుంచి హాలీవుడ్‌కు 10% లాభం లభించేది. కానీ, చైనాలో ప్రజలకు ఈ సినిమాలు వెలకట్టలేనివి.

బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు వారు ఉత్సుకతతో ఉండేవారు. కానీ, చైనా పాలనను సవాలు చేయని సినిమాలను మాత్రమే చూపించి ప్రభుత్వం ఆదాయాన్ని పొందాలని భావించేది.

హెన్రీ కిస్సింగర్

నిషేధం, సయోధ్య

1997లో 3 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల కథలు చైనాకు, హాలీవుడ్ విడిపోయేందుకు కారణమయ్యాయి.

ఇందులో 'సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్', 'కున్‌దున్' ఉన్నాయి. ఈ సినిమాల్లో టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా గురించి చర్చ ఉంది.

మూడో సినిమా రెడ్ కార్నర్. ఈ సినిమాలో చైనా చట్ట వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించారు. ఈ సినిమాలేవీ చైనాలో ప్రదర్శించడానికి అనుమతించలేదు.

కానీ, ఈ సినిమా కథలు మాత్రం చైనా ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో, ఈ సినిమాలను నిర్మించిన మూడు స్టుడియోలను నిషేధించారు. సోనీ, ఎంజీఎం, డిస్నీ లాంటి పెద్ద సంస్థలను నిషేధించడంతో హాలీవుడ్ వెనక్కి వెళ్ళింది.

"ఆ రోజుల్లో హాలీవుడ్‌కు చైనా పెద్ద మార్కెట్ కాదు. కానీ, మొదట్నుంచీ చైనా తన వైఖరిని ప్రదర్శిస్తూనే వచ్చింది.

"చైనాలో ప్రదర్శించలేని సినిమాలు మాత్రమే కాకుండా ఆ స్టూడియోలలో నిర్మించే అన్ని సినిమాలనూ నిషేధిస్తామని చైనా చెప్పింది. చైనా మొదట్నుంచీ యజమాని ఎవరనేది చెబుతూ వచ్చింది" అని సథర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ స్టాన్లీ రోగెన్ అన్నారు.

చైనా మార్కెట్ చిన్నదే అయినప్పటికీ, అమెరికన్ సినీ నిర్మాతలు మాత్రం ఇక్కడున్న వ్యాపారావకాశాలన్నిటినీ పరిశీలించారు. ప్రస్తుతానికి కొంత మంది దిగ్గజాలు మార్కెట్‌లోకి ప్రవేశించారు.

చైనా నమ్మకాన్ని చూరగొనేందుకు డిస్నీ అధినేత మైఖేల్ ఐస్నర్, మాజీ అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ కలిసి ఒక ప్రణాళికను రూపొందించారు. తిరిగి ఈ మూడు స్టూడియోల తలుపులు చైనా లోని ప్రేక్షకుల కోసం తెరుచుకున్నాయి. కానీ, చైనాలో పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలయింది.

"అదే సమయంలో చైనా వార్తాపత్రికలు హాలీవుడ్ సినిమాలను సమీక్ష చేయడం మొదలుపెట్టాయి. టైటానిక్, స్టార్ వార్స్ లాంటి సినిమాలు చైనాలో విజయవంతమయ్యాయి.

https://www.youtube.com/watch?v=ZgqpGsDkPcQ

చైనాలో ప్రదర్శించే హాలీవుడ్ సినిమాల సంఖ్య పెరగడం మొదలయింది. 2001లో చైనాలో ప్రదర్శించిన హాలీవుడ్ సినిమాల సంఖ్య 10 నుంచి 20కి పెరిగింది. 2012లో ఈ సంఖ్య 34కి పెరిగింది. చైనా నుంచి వచ్చే హాలీవుడ్ ఆదాయం కూడా 10 నుంచి 25 శాతానికి పెరిగింది.

కానీ, కొంత కాలానికి అమెరికన్ సినిమాల పట్ల చైనాలో ఆదరణ తగ్గడం మొదలయింది.

"దీనికి చాలా కారణాలున్నాయి. ప్రత్యేక ఎఫెక్ట్‌లతో, భారీ బడ్జెట్ లతో, తారలతో కూడిన సినిమాలను చైనాలోనే సొంతంగా నిర్మించడం మొదలుపెట్టారు. జ్యాకీ చాన్, ఆర్నాల్డ్ క్షాజ్‌నేగర్ లాంటి నటులు రావడం మొదలుపెట్టారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఒకే తరహాలో ఉండటంతో చైనాలో ప్రేక్షకులు సినిమాలను చూసి ముందులా ఆశ్చర్యపోవడం మానేశారు" అని స్టాన్లీ అన్నారు.

చైనాలో ప్రేక్షకుల ఇష్టాల్లో మార్పులు రావడం మొదలయింది. కానీ, హాలీవుడ్‌కు చైనాలోని ప్రేక్షకుల కంటే కూడా ఇక్కడ అమలులో ఉన్న సెన్సార్ ఇబ్బందిగా మారింది.

చైనా చాయిస్ ముఖ్యం

"ఈ అంశం పై పరిశోధన చేస్తున్నప్పుడు సగం సమస్య చైనాలో అమలులో ఉన్న సెన్సార్ షిప్ తో మిగిలిన సమస్య అమెరికా పెట్టుబడిదారీ విధానంతో కూడుకుని ఉందని అర్ధమయింది" అని న్యూ యార్క్‌లోని ప్యాన్ అమెరికా సంస్థ కు చెందిన జేమ్స్ ట్యాగర్ చెప్పారు.

చైనాలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు హాలీవుడ్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో జేమ్స్ వివరించారు.

2020లో చైనా బాక్స్ ఆఫీస్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా మారిపోయింది. చైనాలోకి ప్రవేశించడం పై భారీ హాలీవుడ్ సినిమాల ఆర్ధిక భవితవ్యం పతనం లేదా ఎత్తుకెదగడం ఆధారపడింది.

"చైనాలోని సెన్సార్ విధానాలను దృష్టిలో పెట్టుకోవడం వల్ల పెద్ద సినీ సంస్థలకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయి. హాలీవుడ్ స్టూడియోలు సొంతంగా సినిమాలను సెన్సార్ చేయడం కూడా చూస్తున్నాం. వాళ్ళు నిర్మించిన చిత్రాలను చైనాలో కూడా ప్రదర్శించాలని చూస్తున్నారు" అని జేమ్స్ అన్నారు.

"అయితే, చైనాలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ సినిమాలు తీస్తోందో, లేదా వివాదాస్పదమైన దృశ్యాలను తొలగిస్తుందో తెలుసుకోవడం కష్టం" అని జేమ్స్ అన్నారు.

కానీ, 2014లో సోనీ ప్రతినిధుల ఈ మెయిల్స్ హ్యాక్ అయ్యాయి. ఈ ఈ మెయిల్స్ ద్వారా సైన్స్ ఫిక్షన్ పిక్సెల్స్ గురించి జరిగిన చర్చ తెలిసింది. ఈ సినిమాలో ఎలియన్స్ తాజ్ మహల్ తో పాటు, వాషింగ్టన్ లోని కొన్ని కట్టడాల పై దాడి చేసినట్లు చూపించారు.

ఇందులో వాల్ ఆఫ్ చైనా కూడా ఉంది. అయితే, ఈ దృశ్యాలను చివర్లో తొలగించారు.

"ఇది బయటకు అందరికీ తెలిసిన విషయం. స్టూడియో ప్రతినిధులు ఇలా చేయడం ఎంత సాధారణమో చూపించింది. సినిమా చైనా మార్కెట్‌లో విడుదల చేయాలో లేదోనని వారిలో వారు వాదనలు చేసుకుంటారు" అని జేమ్స్ చెప్పారు.

"కొన్ని సార్లు సినిమాల్లో చేయాల్సిన మార్పుల గురించి చర్చిస్తారు. స్వలింగ సంపర్కుల మధ్య జరిగే సంభాషణలను మారుస్తారు".

అయితే, చాలా మంది ఇందులో పెద్ద విషయమేముందని అనుకుంటారని జేమ్స్ అన్నారు.

"కానీ, ప్రపంచంలో ఉత్తమ సినీ కేంద్రం తమ కథల విషయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతిని తీసుకుంటున్నట్లు అర్ధం. అలాంటి పరిస్థితుల్లో సినిమాలో చాలా రాజకీయ సందేశాలను కూడా చేర్చవచ్చు" అని జేమ్స్ అంటారు.

స్టాన్లీ

"భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను చైనాలో విజయవంతమైతే, అది అమెరికా బాక్స్ ఆఫీస్ ఆదాయాలను రెట్టింపు చేస్తుంది" అని వర్జీనియా యూనివెర్సిటీ ప్రొఫెసర్ అయాన్ కోకస్ అన్నారు.

2020లో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు చైనాలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులున్నారు. ఇక్కడ హాలీవుడ్ గ్లామర్ కంటే కూడా పెట్టుబడిదారుల నుంచి కూడా చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్ధం చేసుకోవాలి.

"డిస్నీ లాంటి సంస్థలు తమ సినిమాల ద్వారా చైనా మార్కెట్‌లో ప్రవేశించాలని అనుకుంటాయి. వారికి సినిమా ద్వారా ఆదాయం సంపాదించడమొక్కటే లక్ష్యం కాదు. వారు కూడా మేధో హక్కులను సృష్టించాలని అనుకుంటారు.

దీనికి చైనా మార్కెట్‌లో శక్తి ఉంది. దీనినుపయోగించి వస్తువుల విక్రయం, థీమ్ పార్కుల నిర్మాణం, వీడియో గేమ్స్, దుస్తులు, బొమ్మల లాంటి ఇతర ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంటారు.

కానీ, చైనా ఎప్పుడు ఎలా సెన్సార్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. గత ఏడాది మార్వెల్ సూపర్ హీరో సినిమా 'షాంగ్ ఛీ, లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్' విడుదల చేశారు.

ఈ సినిమాలను చైనాలో విడుదల అయ్యేందుకు అనుమతించలేదు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలు అంతకు ముందు చైనా పరిపాలనను విమర్శించడమే ఇందుకు కారణం.

"స్పైడర్ మ్యాన్ సినిమా 'నో వే హోమ్' ను విడుదల చేయకుండా ఉండటానికి కూడా ఇలాంటి చిన్న కారణాన్నే చెప్పారు. చైనా దేనికి అభ్యంతరం తెలుపుతుందో హాలీవుడ్ ఊహించలేకపోతోంది" అని అయాన్ కోకస్ చెప్పారు.

1997 నుంచి నేర్చుకున్న పాఠాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. చైనాలో సినిమాలు విడుదల కాకుండా సెన్సార్ షిప్ విధిస్తారు.

"భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం హాలీవుడ్ చైనా మార్కెట్ పై ఆధారపడే సమయం రావచ్చు" అని ఆయన్ కోకస్ చెప్పారు.

ఎంత అనిశ్చితి ఉన్నప్పటికీ, వారి ప్రయత్నాలను మాత్రం మానడం లేదు" అని కోకస్ అన్నారు.

చైనా స్పైడర్ మ్యాన్ ను ఎందుకు నిషేధించింది?

"ఈ సినిమాల ద్వారా అమెరికా ప్రతిష్టను శక్తివంతంగా, గర్వంగా చూపించడాన్ని చైనా సహించలేదు"

" రెండోది చైనా ప్రభుత్వ ఆదర్శాలను ప్రచారం చేసే చైనా సినిమాల కోసం మరింత స్పేస్ కావాలి".

"ఎవరైనా రచయత చైనాలోని కాన్సన్ట్రేషన్ శిబిరాల గురించి చెప్పాలనుకుంటే, అలాంటి వాటిని విడుదల చేయడం అరుదుగా మారుతుంది. దీంతో, అలాంటి సినిమాలు ఎప్పటికీ నిర్మించరు కూడా" అని కోకస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did the Chinese government ban the Spider-Man movie? Why does Hollywood not fall for China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X