రాజధాని ఎక్స్ ప్రెస్ ఘటనలో కుట్ర కోణం ? రైల్వే కీలక నిర్ణయాలు..!
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఇవాళ ఉదయం తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బోగీలో ఉన్న 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీరంతా కాలి బూడిదయ్యేవారు. దీంతో రైల్వేశాఖ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా రైళ్లలో తక్షణం సేఫ్టీ ఆడిట్ కు ఆదేశాలు ఇచ్చింది.
తిరువనంతపురం నుండి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ B-1 కోచ్‌లో తెల్లవారుజామున 5.15 గంటలకు మంటలు చెలరేగాయి. విక్రమ్‌గఢ్ అలోట్, లూనిరిచ్ఛా స్టేషన్ల మధ్య కోచ్ నుండి పొగ, మంటలు వస్తుండటాన్ని రైలు గార్డు గుర్తించి, వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. గార్డు హెచ్చరికతో వెంటనే రైలును నిలిపివేసి, అత్యవసర తరలింపు ప్రక్రియలను ప్రారంభించారు. రైల్వే అధికారులు ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ సరఫరాను తక్షణమే ఆపి, అగ్నిమాపక చర్యలు చేపట్టారు. అయితే, మంటలు B-1 కోచ్ వెనుక ఉన్న రెండో లగేజీ-కమ్-గార్డు వ్యాన్ కు కూడా వ్యాపించాయి. ప్రయాణికులను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు.

ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రైల్వే ఉన్నతాధికారులు.. అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లోని రైలు బోగీలలో అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు, సంబంధిత యంత్రాంగాలపై దేశవ్యాప్త ఆడిట్‌కు కూడా ఆదేశించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటల వ్యాప్తికి కారణాన్ని గుర్తించడానికి అధికారులు ప్రభావిత కోచ్, సంబంధిత పరికరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన కారణంగా పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ఇది రెండు వారాల్లో జరిగిన రెండో రైలు అగ్నిప్రమాదం. మే 15న నాంపల్లి రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు ఏసీ బోగీలలో మంటలు చెలరేగాయి. సాయంత్రం 7 గంటలకు జైపూర్‌కు బయలుదేరడానికి ముందే బీ1, బీ2 కోచ్‌లలో అగ్నిప్రమాదం సంభవించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.












Click it and Unblock the Notifications