వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్‌ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షేక్ హసీనా, మోదీ

బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లపై వరుస దాడుల అనంతరం, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రుంగ్లా తొలిసారి మాట్లాడారు.

రెండు దేశాల సంబంధాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ ద్వైపాక్షిక బంధాలు అంతర్జాతీయ సమాజానికి ''రోల్ మోడల్’’గా నిలుస్తాయని అన్నారు.

1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడటంలో భారత వైమానిక దళం పాత్రపై శనివారం ఆయన ప్రసగించారు.

''పాకిస్తాన్ సైనిక చిత్రహింసలకు వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ కోసం చాలా మంది భారతీయులు ప్రాణత్యాగం చేశారు’’ అని ఆయన అన్నారు.

గోల్డెన్ విజయ్ వర్ష కాన్‌క్లేవ్-2021లో హర్షవర్ధన్ మాట్లాడారు.

''ప్రపంచ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బంధాల కంటే భారత్-బంగ్లాదేశ్ బంధాలు లోతైనవి. ఇవి ప్రపంచ దేశాలకు 'రోల్ మోడల్’గా నిలుస్తాయి. బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పెనవేసుకున్న స్నేహబంధాలు, పరస్పర సహకారం, అవగాహన ఇప్పటికీ కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.

షేక్ హసీనా, మోదీ

దాడుల ప్రస్తావన లేదు..

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడుల గురించి హర్షవర్ధన్ ప్రస్తావించలేదు. దీన్నిబట్టి, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోందని అర్థమవుతోంది.

బంగ్లాదేశ్‌లోని కుమిల్లా, చిట్‌గావ్, నోవాఖలీ, రంగ్‌పుర్‌లలో హిందువులపై దాడులు మొదలైనప్పుడు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. హింసను ప్రేరేపిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ను ఆయన కోరారు.

అయితే, ఈ దాడుల పట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ దాడుల అనంతరం బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి అక్కడి ప్రధాన హిందూ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే, ఈ సమావేశ వివరాలు చాలా గోప్యంగా ఉంచారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు మరింత బలపడ్డాయని హర్షవర్ధన్ శనివారం చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు.

''భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో బంగ్లాదేశ్ ఒకటి. దక్షిణాసియాలో అయితే, అతిపెద్ద భాగస్వామి బంగ్లాదేశ్. ఆసియా ఆర్థిక అభివృద్ధిలో రెండు దేశాల మధ్య బంధాలు చాలా కీలకం’’ అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్

విమర్శలకు దూరంగా

హర్షవర్ధన్ ప్రకటనను చూస్తుంటే, హిందువులపై దాడుల విషయంలో బంగ్లాదేశ్‌ను మోదీ ప్రభుత్వం విమర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

బంగ్లాదేశ్‌తో సంబంధాలు గాడి తప్పకూడదని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తోపాటు పొరుగున్న దేశాల్లో హిందువులు, ఇతర మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

షేక్ హసీనా, జిన్‌పింగ్

బంగ్లాదేశ్‌లో చాలా హైప్రొఫైల్ ప్రాజెక్టుల్ని చైనా చేపడుతోంది. గత గురువారం బంగ్లాదేశ్-చైనా ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రారంభించారు. ఢాకా శివార్లలో 26 ఎకరాల్లో ఈ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. బంగ్లాదేశ్, చైనాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక బంధాలకు ఈ సెంటర్‌ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఉత్తర, దక్షిణ బంగ్లాదేశ్‌లను అనుసంధానించే ఓ వంతెనను 2018లో నిర్మించారు. ఆరు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన రెండు ప్రాంతాలను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానిస్తోంది. బంగ్లాదేశ్ అవతరణ తర్వాత చేపట్టిన, అత్యధిక సవాళ్లతో కూడుకున్న ఇంజినీరింగ్ ప్రాజెక్టు ఇదేనని చెప్పొచ్చు.

పద్మా నదిపై నిర్మించిన ఈ వంతెన కోసం చైనా 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు)ను పెట్టుబడిగా పెట్టింది.

బంగ్లాదేశ్

చైనా ప్రాబల్యం

ఈ ప్రాజెక్టు విషయంలో చైనా కేవలం డబ్బులు మాత్రమే పెట్టుబడిగా పెట్టలేదు. ఇంజినీరింగ్ విషయంలో సాంకేతిక సాయాన్ని కూడా అందించింది. రెండు దేశాల మధ్య బలోపేతం అవుతున్న బంధాలకు ఈ వంతెన ఒక ఉదాహరణ అని చైనా అధికారిక వార్తా సంస్థ షిన్‌హువా ఒక కథనం ప్రచురించింది.

బంగ్లాదేశ్‌లో 30 బిలియన్ డాలర్ల (రూ.2,24,999 కోట్లు) ప్రాజెక్టులను చైనా చేపడుతోంది. పద్మా నదిపై తాజా వంతెన కూడా దీనిలో భాగమే. బంగ్లాదేశ్‌లో నానాటికీ పెరుగుతున్న చైనా ఆధిపత్యంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముందని విదేశాంగ నిపుణులు, దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు.

బంగ్లాదేశ్.. భారత్‌ల మధ్య మొదట్నుంచీ మంచి సంబంధాలున్నాయి. బంగ్లాదేశ్‌ను భారత్‌కు సహజ భాగస్వామిగా నిపుణులు అభివర్ణిస్తారు. అయితే, ఈ భావన క్రమంగా మారుతూ వస్తోంది. బంగ్లాదేశ్ అవతరణలో భారత్ ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవమే. అయితే, పాకిస్తాన్‌కు అత్యంత మిత్రదేశమైన చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌కూ చేరువవుతోంది.

ఢాకా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో 25 శాతం వాటా కొనుగోలు సమయంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1109 మిలియన్ డాలర్లు (రూ.8,317 కోట్లు) విలువైన ఈ వాటాను భారత్‌కు చెందిన నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)కు బదులుగా షాంఘైకు చెందిన షెంజెన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు విక్రయించారు.

చైనా-బంగ్లాదేశ్‌ల మధ్య ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఎన్‌ఎస్‌ఈ అధికారులు ఢాకాకు కూడా వెళ్లారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకపోయింది. చైనా తమ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ఈ వాటాను దక్కించుకుందని బ్లూంబర్గ్ ఓ వార్త ప్రచురించింది.

షేక్ హసీనా

భారత్ మెతక వైఖరి

ఈ పరిణామాల నడుమ భారత్ వైఖరి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. పొరుగునున్న దేశంలోని హిందువులపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ భారత్ ఆచితూచి స్పందిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలకు సంఘీభావంగా భారత్ తమ దౌత్య ప్రతినిధుల సాయంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నివేదనలు పంపించేది. కానీ ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

దీనికి విరుద్ధంగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తమకు విశ్వాసం ఉందని భారత్ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హసీనాను మరింత ఇరుకున పెట్టడం ఇష్టంలేకే భారత్ ఇలా స్పందిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గతంలో జరిగిన ఇలాంటి ఘటనలతో పోలిస్తే, ప్రస్తుత పరిణామాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. నాసినగర్, సిల్హట్, మురాద్‌నగర్‌లలో ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, భారత్ గట్టిగానే స్పందించింది.

అంతేకాదు, బంగ్లాదేశ్‌లోని భారత రాయబారులు ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కుల గురించి వారు మాట్లాడారు.

అయితే, ఇప్పుడు కుమిల్లా, చాంద్‌పుర్, ఫెనీ, చిట్‌గావ్‌లలో పరిస్థితులపై భారత్ వైఖరి చాలా మెతకగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా దాడులపై గత వారం బీబీసీతో భారత మాజీ దౌత్యవేత్త పినాకరంజన్ చక్రవర్తి మాట్లాడారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.

''మతం పేరుతో హసీనా ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. అయితే, వారు విజయం సాధించలేరు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India not acting fast over the attacks of Hindu temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X