వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్ల దగ్గర నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత ఎందుకు ఏర్పడుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రపంచ సరఫరా గొలుసు తీరుతెన్నులు క్రమక్రమంగా మారిపోతున్నాయి

అంతర్జాతీయ సరఫరా గొలుసు (సప్లయి చెయిన్) గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు. పిల్లలు ఆడుకునే స్పైడర్‌మ్యాన్ బొమ్మల దగ్గర నుంచి కార్లలో వాడే సెమీకండక్టర్ల వరకు డిమాండ్, సరఫరా మధ్య అంతరాలు బాగా పెరిగాయి.

అమెరికాలో అనేక కార్గో షిప్‌లు చాలా రోజుల పాటు సముద్రంలోనే వేచి చూడాల్సి వస్తోంది. వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ పోర్టులు అందుకు సిద్ధంగా లేవు.

"అమెరికాలో వస్తువులకు డిమాండ్, వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా అధికంగా ఉన్నాయి. కానీ, పోర్టుకు వచ్చే అన్ని నౌకలకు మేము వసతి కల్పించలేకపోతున్నాం" అని లాస్‌ ఏంజలస్ పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేన్ సెరోకా తెలిపారు.

"నైక్ దగ్గర అమ్మకానికి తగినన్ని బూట్లు లేవు. పేపర్ టవల్స్ అమ్మకంపై కాస్టో హోల్‌సేల్ కార్పొరేషన్ పరిమితులను విధించింది. కృత్రిమ క్రిస్మస్ ట్రీల ధరలు 25 శాతం వరకు పెరిగాయి" అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనాన్ని చూస్తే ఈ పరిస్థితుల ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది.

వస్తువులకు డిమాండ్ పెరిగిపోతోంది కానీ సప్లయి పెరగట్లేదు

ఈ పరిస్థితికి కారణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదట చెప్పుకోవాల్సింది మాత్రం కోవిడ్-19.

లాక్‌డౌన్ కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన క్లయిర్ జోన్స్ అభిప్రాయపడ్దారు.

"ఆ సమయంలో అందరం ఇంట్లోనే ఉండిపోయాం. బయటకి వెళ్లింది లేదు. రెస్టారెంట్లకు వెళ్లి ఖర్చుపెట్టలేదు. పార్టీలు, వేడుకలు లేవు. సాధారణంగా మనం డబ్బును వీటి మీదే ఖర్చు చేస్తూ ఉంటాం. ఆ డబ్బంతా మిగిలింది. దాన్ని ఇప్పుడు వస్తువులను కొనడానికి వినియోగిస్తున్నాం" అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్ ముగిసి, మార్కెట్లు తెరుచుకునే సమయానికి ప్రజల చేతుల్లో దండిగా డబ్బు ఉంది. వస్తువులకు డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు.

నాణేనికి మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు, సంస్థలు మూతపడ్డాయి. కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది. వస్తువుల తయారీ ఆగిపోయింది. సరఫరా తగ్గిపోయింది.

షిప్పింగ్ లాంటి ఇతర కారణాలూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచంలోని 90 శాతం వస్తువులు సముద్ర మార్గంలోనే ఒక దేశం నుంచి మరో దేశానికి చేరుతాయి.

అంతర్జాతీయంగా 90 శాతం వస్తువులు సముద్ర మార్గంలోనే రవాణా అవుతాయి

సముద్ర మార్గాల్లో ఇబ్బందులు

ఈ సంవత్సరం సముద్ర మార్గాల్లో అనేక ఇబ్బందులను ప్రపంచం చూసింది.

మార్చిలో సూయజ్ కాలువలో ఓడ చిక్కుకుపోయింది. ఆసియా నుంచి ఐరోపాకు వస్తువులకు తీసుకెళ్లే కార్గో నౌకలకు సూయజ్ కాలువ ఒక సత్వరమార్గం (షార్ట్‌కట్).

సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డం తిరిగినప్పుడు అనేక ఇబ్బందులు తలెత్తాయి.

"కేవలం ఒక ఓడ కాలువలో చిక్కుకుపోయిన ఘటన ప్రపంచ సరఫరా గొలుసుపై ఎంత ప్రభావం చూపిస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది" అని బీబీసీ ఇంటర్నేషనల్ బిజినెస్ కరస్పాండెంట్ థియో లాగర్ట్ వ్యాఖ్యానించారు.

కోవిడ్-19 కారణంగా ఇంతకుముందు వెళ్లని తీరాలకు నౌకలు వెళ్లాల్సివస్తోంది. దాంతో ధరలు పెరిగిపోతున్నాయి.

"చైనా నుంచి వచ్చే 40 అడుగుల కంటైనర్ కోసం ఎప్పుడూ 2700 పౌండ్ల కన్నా ఎక్కువ చెల్లించలేదు. కానీ, ఈరోజు అలాంటి ఒక కంటైనర్ కోసం 15000 పౌండ్ల బిల్లు పడింది. ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పనిచేయడం చాలా కష్టంగా మారింది" అని గేమ్ మేకర్ సంస్థ హ్యాపీ పజిల్ గేమింగ్ సీఈఓ కెవిన్ ఉకో అన్నారు.

సప్లయి చెయిన్ నెట్‌వర్క్

పెరుగుతున్న ధరల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

"మార్కెట్లో కలప ధరలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. సప్లయి చెయిన్ నెట్‌వర్క్ మీద మునుపటిలా భరోసా ఉంచలేకపోతున్నాం. డెలివరీ చేయడానికి డ్రైవర్‌లు అందుబాటులో ఉండట్లేదు. ప్రతిదీ కష్టం అయిపోతోంది" అని ఆర్కిటెక్ట్ విల్ఫ్ మెలిన్ వాపోయారు.

బ్రిటన్, అమెరికాతో సహా అనేక దేశాల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.

జూలై 8న ఫోర్బ్స్ ప్రచురించిన ఒక రిపోర్టులో అమెరికా సంస్థలు ఎదుర్కొంటున్న మానవ వనరుల కొరత గురించి చర్చించారు.

ఓడరేవుల్లో నౌకలకు స్థలం దొరకకపోవడానికి సిబ్బంది కొరత కూడా ఒక కారణం.

Reuters

ప్రపంచ రాజకీయాలు

ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు కూడా సప్లయి చెయిన్‌లో మార్పులకు కారణం అవుతున్నాయి.

చైనాపై తక్కువగా ఆధారపడడం ద్వారా అమెరికాలో సరఫరా గొలుసును బలోపేతం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు.

అమెరికాలో పీపీఈ కిట్లు, ఇతర అత్యవసరాల ఆవశ్యకత ఉన్నప్పుడు కూడా ఈ విధానమే పాటిస్తున్నట్లు కనిపించింది.

"జాతీయ విపత్తు సంభవించినప్పుడు దేశ రక్షణ, అవసరాల కోసం మరొక దేశంపై ఆధారపడాలనుకోవడం లేదు. ముఖ్యంగా మన విలువలను, అవసరాలను వారు అర్థం చేసుకోలేనప్పుడు" అని ఫిబ్రవరిలో బైడెన్ ఒక ప్రసంగంలో అన్నారు.

బైడెన్ తన ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేశారుగానీ ఇలాంటి రాజకీయ నిర్ణయాలు ప్రపంచ సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతాయి.

క్లిష్టమైన ప్రక్రియ

గ్లోబలైజేషన్‌తో పాటూ ఉత్పత్తిలో ఒక కొత్త భావన పుట్టుకొచింది. అదే 'జస్ట్ ఇన్ టైమ్'.

ఈ వ్యవస్థ ప్రకారం, కంపెనీలకు అవసరమైనప్పుడు మాత్రమే వస్తువులను డెలివరీ చేస్తారు. ఇలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుందని భావిస్తున్నారు.

ఇది చాలా మంచి వ్యవస్థే. సమయానికి సక్రమంగా డెలివరీ జరుగుతున్నంతవరకు ఇది బాగా పనిచేస్తుంది.

ఉదాహరణకు, సెమీకండక్టర్లను ఆటో ఇండస్ట్రీలో వినియోగిస్తారు. వాహనాలు, ఇతర విద్యుత్ పరికరాలకు కూడా ఈ చిప్స్ అవసరం అవుతాయి.

ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువుల అమ్మకాలు పెరిగినందువలన ఈ చిప్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దాంతో, మార్కెట్లో చిప్స్ కొరత ఏర్పడింది.

దీనివలన టయోటా సంస్థ తన ఉత్పత్తిలో 40 శాతం తగ్గించాల్సి వచ్చింది.

"దీని ప్రభావం మొత్తం ఇండస్ట్రీ మీద పడుతోంది. ఉత్పత్తి సామర్థ్యం మీద పడుతోంది" అని వాహన తయారీ సంస్థ వాక్స్‌హాల్ బ్రిటన్ ఎండీ పాల్ విల్కాక్స్ అన్నారు.

ఇవన్నీ చూస్తుంటే.. అవేవో అమెరికా, చైనాలకు సంబంధించిన విషయాలు, మనకు వీటితో సంబంధం లేదనిపిస్తుందిగానీ ఇవన్నీ మనతో నేరుగా ముడిపడి ఉన్న అంశాలే.

ఇవన్నీ, సప్లయి చెయిన్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నది ఒక అంశం అయితే, ప్రపంచం పనితీరు ఎలా మారుతోందన్నది కూడా దీని ద్వారా మనకు తెలుస్తుంది.

ప్రపంచీకరణ వలన వస్తువుల ధరలు బాగా తగ్గాయి. వాటి లభ్యత పెరిగిందన్నది వాస్తవమే.

సమయానికి మనకు వస్తువులు దొరుకుతున్నాయా, వాహనాలు లభ్యం అవుతున్నాయా అన్నది మాత్రమే కాదు సమస్య. ఎంత పరిమాణంలో వస్తువులను ఉత్పత్తిచేస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం, అవి ఎక్కడ, ఎలా తయారవుతున్నాయి అనే అంశాలు కూడా ముఖ్యమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is there a shortage of goods around the world, from cars to children's toys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X