'ప్రధాని మోదీ ఇంటిపై పాక్ డ్రోన్లు?'
పాకిస్థాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ మరోసారి ఇండియాను ఉద్దేశించి అత్యంత హాస్యాస్పదమైన, బడాయి కామెంట్స్ చేశారు. గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ.. తమ సైన్యానికి చెందిన డ్రోన్లు ఏకంగా ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం పైవరకు వెళ్లాయని మొహ్సిన్ నఖ్వీ అన్నారు. అయితే ఈ కామెంట్లకు ఎలాంటి ఆధారం కానీ, కనీస సాక్ష్యాలు కానీ లేవు. గత 2025 మే 7 నుంచి 10 వరకు ఇరు దేశాల మధ్య తీవ్రమైన సైనిక ఘర్షణ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క ఆయుధం లేదా డ్రోన్ భారత రాజధాని సరిహద్దుల్లోకి కూడా ప్రవేశించలేకపోయిందనేది పచ్చి నిజం.
భారత్‌ను వణికించామంటూ పాక్ మంత్రి బడాయిలు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మొహ్సిన్ నఖ్వీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన గతేడాది జరిగిన యద్ధం గురించి మాట్లాడుతూ.. "భారత్, పాకిస్థాన్ దేశాలు తమ దాడుల కోసం డ్రోన్లను ఉపయోగించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఎప్పుడు ఘర్షణలు జరిగినా డ్రోన్లు వాడలేదు. భారత్ మాపై డ్రోన్ దాడులు చేసినప్పడు వారి డ్రోన్లు మా నగరాల వైపు వచ్చాయి. అప్పుడు పాక్ సైన్యం అలర్ట్ అయి వాటిని కూల్చేసింది. కానీ ఆ తర్వాత మేము డ్రోన్లను ప్రయోగించినప్పుడు భారత్ వాటిని అడ్డుకోలేకపోయింది. మా డ్రోన్లు ఏకంగా ఢిల్లీ దాకా వెళ్లి అక్కడ భయాందోళనలు సృష్టించాయి" అంటూ మొహ్సిన్ నఖ్వీ నోటికొచ్చినట్లు వాగారు.

డబ్బా కొట్టుకుంటున్న పాక్ నేతలు
భారత్‌పై ఇలాంటి నిరాధారమైన కామెంట్స్ చేసిన మొదటి పాకిస్థానీ మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాత్రమే కాదు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా పలు సందర్భాల్లో.. ఆ 4 రోజుల యుద్ధంలో తామే గెలిచామని, భారత్‌ను ఓడించామని సొంత డబ్బా కొట్టుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ.. పాక్ నేతలు మాత్రం ఇంటర్నెట్ వేదికగా తమకు తామే వీరులమంటూ వెన్ను తట్టుకుంటున్నారు.
ఆ 4 రోజులు యుద్దం ఎందుకు జరిగింది?
గతేడాది ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ మెరుపు దాడులు చేసింది. భారత సైన్యం చేసిన ఈ దాడులకు బదులుగా పాక్ సైన్యం కూడా ఎదురుదాడులకు ప్రయత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థను దాటి భారత సైన్యానికి ఎలాంటి పెద్ద నష్టాన్ని చేకూర్చడంలో పాక్ పూర్తిగా విఫలమైంది. నాలుగు రోజుల హోరాహోరీ పోరు తర్వాత, మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం ముగిసిన తర్వాత, భారత దాడుల వల్ల పాకిస్థాన్‌లో ఎంతటి భారీ నష్టం జరిగిందో చూపే పలు శాటిలైట్ ఫోటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి పాక్ పరువు తీశాయి.












Click it and Unblock the Notifications