కేంద్ర ఖజానాకు ఆర్బీఐ భారీ అండ. దేశ చరిత్రలోనే రికార్డు!
భారత ఆర్థిక రంగానికి అత్యంత ఊరటనిచ్చే ఒక బంపర్ గుడ్‌న్యూస్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మోసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఊహించని రీతిలో భారీ అండగా నిలుస్తూ.. ఏకంగా రూ. 2.87 లక్షల కోట్ల (రూ. 2,86,588.46 కోట్లు) భారీ మిగులు నిధుల (డివిడెండ్) బదిలీకి ఆర్బీఐ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లింపులలో ఒకటిగా నిలిచిన ఈ నిర్ణయం, దేశ ఆర్థికాభివృద్ధికి మరియు బడ్జెట్ అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన కేంద్ర బోర్డు డైరెక్టర్ల 623వ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వాతావరణంలో జరిగింది. ఈ హై-ప్రొఫైల్ మీటింగ్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి భారీ నిధుల బదిలీ ప్రతిపాదనపై బోర్డు అధికారిక ముద్ర వేసింది. ఈ సమావేశానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జె, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్‌లతో పాటు కేంద్ర బోర్డులోని ఇతర కీలక డైరెక్టర్లు హాజరయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, వాటి వల్ల తలెత్తే సవాళ్లు, ప్రమాదాలపై ఈ సందర్భంగా బోర్డు సభ్యులు సుదీర్ఘంగా సమీక్షించారు.

26 శాతం పెరిగిన స్థూల ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఆర్థిక స్థితిగతులు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. కేంద్ర బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాలంలో ఆర్బీఐ స్థూల ఆదాయం రికార్డు స్థాయిలో 26.42 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో, రిస్క్ కేటాయింపులకు ముందు ఖర్చులు 27.60 శాతం పెరిగాయి. వివిధ రకాల రిస్క్ కేటాయింపులు, చట్టబద్ధమైన నిధుల బదిలీకి ముందు ఆర్బీఐ నికర ఆదాయం రూ. 3,95,972.10 కోట్లుగా నమోదైంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఈ నికర ఆదాయం రూ. 3,13,455.77 కోట్లుగా మాత్రమే ఉండటం గమనార్హం.
రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన బ్యాలెన్స్ షీట్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామర్థ్యం ఎంతలా పెరిగిందో చెప్పడానికి దాని బ్యాలెన్స్ షీట్ విస్తరణే ఒక ఉదాహరణ. 2026 మార్చి 31 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ఏకంగా 20.61 శాతం విస్తరించి, రూ. 91,97,121.08 కోట్ల మైలురాయికి చేరుకుంది. దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునేందుకు వీలుగా ఉండే 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (CRB)కు సైతం ఆర్బీఐ భారీగా నిధులను కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,09,379.64 కోట్లను ఈ రిస్క్ బఫర్ నిధికి బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. గత ఏడాది ఈ కేటాయింపు రూ. 44,861.70 కోట్లుగా ఉంది. అయితే, బ్యాంక్ భద్రతా ప్రమాణాల ప్రకారం ఈ CRB నిధిని మొత్తం బ్యాలెన్స్ షీట్ పరిమాణంలో కచ్చితంగా 6.5 శాతంగానే కొనసాగించారు.














Click it and Unblock the Notifications