వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ అక్కడి పాలక కమ్యూనిస్టు పార్టీలోని ఓ సీనియర్ అధికారైన లియూ జియాన్‌చావోతో ఈనెల 12వ తేదీ బుధవారం భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులు, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత వైఖరి గురించి లియూకు విక్రమ్ వివరించినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది.

భారత్, చైనా రాజకీయ స్థాయిలో చర్చల ద్వారా తమ మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలను తగ్గించుకునే అవకాశాలు పెరుగుతున్నట్లు ఈ పరిణామం సంకేతాలు ఇచ్చింది.

కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా లియూ జియాన్‌చావోను భావిస్తారు.

ఇదివరకు ఆయన కొన్ని దేశాల్లో చైనా రాయబారిగా, చైనా విదేశాంగ శాఖ ప్రధాన అధికార ప్రతినిధిగానూ పనిచేశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విక్రమ్, లియూల భేటీకి చాలా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్ చేసిన ఓ ప్రయత్నంగా విశ్లేషకులు దీన్ని చూస్తున్నారు.

ఉద్రిక్తతల తగ్గింపు విషయమై ఇదివరకు రెండు దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన సమావేశాలతో పెద్దగా ప్రగతి సాధ్యం కాలేదని, ఈ విషయమై రెండు దేశాల మధ్య జరిగిన తొలి దౌత్య స్థాయి భేటీ ఇదేనని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నిర్మాణాత్మక అడుగుగా వాళ్లు వర్ణిస్తున్నారు.

విక్రమ్ మిస్రీ, లియూ జియాన్‌చావో

చైనా ఇప్పటికీ సరిహద్దుల నుంచి వెనక్కితగ్గలేదని, మౌలిక వసతులను పెంచుకునే కార్యకలాపాలను కూడా ఆ దేశం కొనసాగిస్తోందని భారత్‌లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో సమావేశాలు జరిగే ఆస్కారమున్నట్లు విక్రమ్, లియూ భేటీ సంకేతాలిస్తోందని కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు.

వీరి భేటీకి ముందు ఆదివారం భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగాయి.

భారత్‌ను ఇప్పటికీ తమ మిత్ర దేశంగా భావిస్తున్నామని, ఆ దేశంతో తాము శాంతి కొనసాగాలని కోరుకుంటున్నామని చైనా భావిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ ప్రకటనలు, మీడియా తీరు సూచిస్తున్నాయి.

ఇటీవలే చైనాకు చెందిన కొందరు రాజకీయ విశ్లేషకులతో బీబీసీ మాట్లాడింది.

వారు పరోక్షంగా అమెరికా గురించి ప్రస్తావిస్తూ... ''భారత ప్రభుత్వం విదేశీ శక్తుల చేతిలో పావుగా మారుతోంది’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌లోని చైనా రాయబారి సున్ వెయిదోంగ్ గత వారం భారతీయ మేధావులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.

''భారత్, చైనా ప్రత్యర్థులుగా కాదు, మిత్రులుగా ఉండాలి’’ అని ఆయన అన్నారు.

గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావిస్తూ... చైనా తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటుందని, అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కూడా కోరుకుంటోందని అన్నారు.

‘చైనాకు తాము వ్యతిరేకమంటే తాము వ్యతిరేకమని... భారత్‌లోని అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది’

భారత్‌లో సోషల్‌మీడియాలో ఇటీవల "#ThrowChinaOut" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఇలాంటి చైనా వ్యతిరేక భావనల పట్ల ఆ దేశం ఆందోళనపడుతున్నట్లు కనిపిస్తోంది.

''భారత ప్రభుత్వం చాలా చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది. ద్వైపాక్షిక వాణజ్యం విషయంలో ఆంక్షలు తెస్తోంది. మరోవైపు చైనాకు వ్యతిరేకంగా ఇంకా గట్టి చర్యలు తీసుకోవడం లేదంటూ భారత్‌లోని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం కోసం ప్రధాని మోదీపై, బీజేపీపై విమర్శలు చేస్తోంది’’ అని గ్లోబల్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో షిన్హువా విశ్వవిద్యాలయ ప్రొఫసెర్ షో చావో అభిప్రాయపడ్డారు.

''చైనాకు తాము వ్యతిరేకమంటే తాము వ్యతిరేకమని... భారత్‌లోని అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

భారత్ చర్యలతో చైనా సహనం కోల్పోయే అవకాశం ఉందని, తాజా భేటీ మంచి పరిణామమని షిన్హువా విశ్వవిద్యాలయానికే చెందిన హువాంగ్ యుంగ్ అనే ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

''జాతీయవాదాన్ని ప్రోత్సహించడం కోసం చైనా వస్తువులు, దిగుమతులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకోకూడదు. చైనాతో చర్చల మార్గాన్ని అనుసరించాలి’’ అని ఆయన అన్నారు.

చైనా దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించడం, 'ఆత్మ నిర్భరత’ విధానాలు పాటించడం వంటివి చేసినా... గత మూడు నెలల్లో భారత్, చైనాల ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్

శిఖరాగ్ర సదస్సు సాధ్యమా...

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో టెలిఫోన్‌లో సంభాషించారు.

దీని గురించి ప్రస్తావిస్తూ సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు నిర్మాణాత్మకమైన అంగీకారం కుదిరిందని చైనా రాయబారి గత వారం అన్నారు.

తమ దేశం చర్చల మార్గాన్నే కోరుకుంటోందని ఆయన చెప్పారు.

గత కొన్నేళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య 'శిఖరాగ్ర సమావేశాలు’ జరిగాయి. వీటి వల్ల రెండు దేశాల బంధాలు బలపడ్డాయి.

విక్రమ్, లియూల భేటీ తర్వాత శిఖరాగ్ర సమావేశం జరిగే అవకాశాలు పెరిగాయని చైనా వ్యవహారాల నిపుణుడైన జర్నలిస్ట్ సందీప్ గుప్తా అభిప్రాయపడ్డారు.

''నేను సానుకూలంగా ఆలోచిస్తాను. ఇక్కడ జనం సమావేశం కోరుకోవడం లేదు. బుధవారం జరిగిన భేటీపై కూడా మరీ అంతగా ఆశలు లేవు. కానీ, రెండు పక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగితే, ఉద్రిక్తతలు తగ్గుతాయి. అప్పుడు సమావేశానికి మార్గం సుగమమవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

''భారత్, చైనా ఆసియాలోని పెద్ద దేశాలు. ఈ రెండింటి మధ్య విభేదాల కన్నా, సారూప్యతలే ఎక్కువ. మన రెండు దేశాలకు రెండు ప్రాచీన నాగరికతలు ఉన్నాయి. పరస్పర సహకారంతో మనం అభివృద్ధి సాధించగలం’’ అని ప్రొఫెసర్ హువాంగ్ యుంగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will the relationship between India and China comeback to normal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X