హిందువులపై దాడులతో కుతకుతలాడుతున్న బంగ్లా
Year Ender 2024 Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో ఈ ఏడాది చివరి అయిదు నెలలు అట్టుడికిపోతున్నాయి. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు.
ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. ఆయా ఘటనల్లో అరెస్టయిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఈ అయిదు నెలల వ్యవధిలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులకు సంబంధించిన 2,200లకు పైగా కేసులు నమోదయ్యాయంటే అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని ఢాకా- 79 మొదలుకుని ప్రధాన నగరాలైన రంగ్‌పూర్- 219, మైమెన్‌సింగ్- 183, రాజాషాహి- 155, బారిషాల్- 68, చిత్తోగ్రామ్- 45, సియాల్హట్- 25లల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారాయనను. హిందువులపై దాడులను అడ్డుకునేలా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిడిని తీసుకుని రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం కేంద్రానికి డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు చెలరేగుతూ వచ్చాయి. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.
సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. ఆ తరువాత ఆమె ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత ఉండట్లేదు. ఆమె కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది.
దీని తరువాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, జమాతె ఇస్లామీ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. జైలు శిక్షను అనుభవిస్తోన్న మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications