యోగా వివక్ష చూపదు, సంతృప్తినిస్తుంది: ఐరాస
న్యూయార్క్/న్యూఢిల్లీ: యోగా ఎవరి పట్ల వివక్ష చూపదని, ఎవరు చేసినా తృప్తినిస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వమిస్తున్నా సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాన్ కీ మూన్ మాట్లాడుతూ.. తాను గత జనవరిలో భారత్ వచ్చినప్పుడు ఢిల్లీలో మొదటిసారి యోగా చేశానని తెలిపారు. అది తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని గుర్తు చేసుకున్నారు.
యోగాని ఎవరైనా, ఏ వయస్సులోనైనా చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి రావడం వల్లే తనకు యోగా చేసే అవకాశం లభించిందని బాన్ కీ మూన్ తెలిపారు.
20 దేశాల్లో యోగా ప్రదర్శన

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న 20 దేశాల్లోని భారత ఎంబసీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రముఖ కళారుడు బినయ్ కె బెల్ గీసిన చిత్రాలు ప్రదర్శిస్తారు. ‘యోగా అందరికీ.. యోగా ఆరోగ్యం కోసం'నినాదంతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
యోగాకు సంబంధించి వివిధ ఆసనాలపై 64 చిత్రాలు ఇందులో చోటుచేసుకుంటాయి. భారత్, వియత్నాం, యుఎస్‌లో వీటిని ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. యోగాపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని యోగా దినోత్సవం సందర్భంగా 50 దేశాల్లో ప్రదర్శించనున్నట్టు బినయ్ వెల్లడించారు.
‘ప్రపంచం తీవ్రమైన శారీరక, మానసిక వత్తిళ్లతో బాధపడుతుంది. వీటి నుంచి బయటపడాలన్నదే నా ఉద్దేశం. దానికి యోగానే పరిష్కారం చూపుతుంది. మానసిక సమస్యలకు సరైన మందు యోగా'అని ఆయన స్పష్టం చేశారు. ఐరాసలో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై తీర్మానం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ చూపిన చొరవ మరువలేమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications