పంజాబ్ కింగ్స్‌కు మరో దెబ్బ: మరో స్టార్ బ్యాటర్ కూడా దూరం
న్యూఢిల్లీ: ఇంకో రెండు రోజులు.. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఐపీఎల్ 2023 ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. ఎల్లుండి తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా, సీఎస్‌కేకు మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు. గుజరాత్ టైటన్స్‌కు ఇది హోం పిచ్. పైగా హార్దిక్ పాండ్యా లోకల్ క్రికెటర్ కావడం కలిసొచ్చే అంశం. హోం పిచ్ పై గుజరాత్ టైటన్స్ ఎలా చెలరేగుతుందనేది ఆసక్తిగా మారింది.
ఏప్రిల్ 1వ తేదీ రెండో మ్యాచ్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్‌తో కోల్ కత నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతోంది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకే మ్యాచ్ మొదలవుతుంది. ఆ రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. కోల్ కత నైట్ రైడర్స్ నాయకత్వ బాధ్యతలను నితీష్ రాణా తీసుకున్నాడు. బ్యాక్ పెయిన్ వల్ల శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే.

కాగా సీజన్ ఆరంభానికి ముందే పంజాబ్ కింగ్స్ బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. డాషింగ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో జట్టుకు దూరం అయ్యాడు. సిరీస్ మొత్తానికీ ఆడట్లేదు. గాయం వల్ల కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తోన్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఫిట్ నెస్ సాధించాడు. ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత యాషెస్ టోర్నమెంట్ ను ఆడాల్సి ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ ప్రతిష్ఠాత్మక యాషెస్ కోసం సన్నద్ధం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలిందా జట్టుకు. మిడిలార్డర్ స్టార్ బ్యాటర్, పించ్ హిట్టర్ గా పేరున్న లియామ్ లివింగ్‌స్టొన్ కూడా ఆడట్లేదు. తొలి మ్యాచ్‌కు మాత్రమే లియామ్ లివింగ్‌స్టొన్ దూరం అయ్యాడని పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ నుంచి ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందకపోవడం వల్ల లివింగ్‌స్టొన్ ఈ మ్యాచ్ లో ఆడట్లేదు. ఈసీబీ నుంచి ఎన్ఓసీ అందిన వెంటనే అతను భారత్‌కు బయలుదేరి వస్తాడు. సకాలంలో అతనికి ఈసీబీ ఎన్ఓసీ ఇవ్వకపోవడానికి కారణం ఉంది. లివింగ్‌స్టోన్ గత ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్‌లో ఆ దేశ జట్టుతో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డాడు. అతని మోకాలికి గాయమైంది. ఆ తరువాత స్వదేశంలో జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్ లో కూడా మడమ గాయంతో బాధపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహిస్తోంది ఈసీబీ. వంద శాతం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ను ఇవ్వడానికి స్కానింగ్‌ను నిర్వహించాల్సి ఉంది. అందుకే ఎన్ఓసీ ఇంకా ఇవ్వట్లేదు.












Click it and Unblock the Notifications