IPL 2023 Playoffs: మూడు బెర్త్‌ల కోసం ఏడు జట్ల మధ్య ఫైట్- ఆ టీమ్స్‌కే ఛాన్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఇక ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్టామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ చివరి లీగ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.
ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లల్లో తొమ్మిది విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది గుజరాత్ టైటాన్స్. 18 పాయింట్లతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. చివరి లీగ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడినా పెద్దగా ప్రభావం పడదు. ఆర్సీబీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. ఇంకా రెండు మ్యాచ్‌లు చేతిలో ఉన్నాయి.

18వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ స్టేడియంలో, 21న గుజరాత్ టైటాన్స్‌తో బెంగళూరులో తలపడబోతోంది. ఈ రెండింట్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలవగలుగుతుంది. ఏ ఒక్కటి ఓడినా పరిస్థితులు తలకిందులవుతాయి. ఇతర జట్ల నెట్ రన్‌రేట్ మీద ఆధారపడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటుంది. సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్‌పై ఓడితే మాత్రం ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయినట్టే.
సోమవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. ఈ విజయంతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ తప్పుకొంది. ఢిల్లీ కేపిటల్స్ పరిస్థితి కూడా అంతే. ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసులో లేదు.
మిగిలిన మూడు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. ఆ మూడు ప్లేఆఫ్స్ స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ బరిలో ఉన్నాయి. ఇప్పుడున్న నెట్ రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటే చెన్నై, ముంబై, లక్నో సూపర్ జెయింట్స్‌కు మాత్రమే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి.
శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ ఆడబోతోంది. ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఇది షెడ్యూల్ అయింది. గెలిస్తే- నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది ధోనీ సేన. ఓడినా ప్లేఆఫ్స్ అవకాశాలు పెద్దగా ప్రభావితం కాబోదు. ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడనున్నాయి.
ఏది గెలిచినా ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతాయి. ముంబై ఇండియన్స్-14, లక్నో సూపర్ జెయింట్స్-13 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇవ్వాళ్టి మ్యాచ్‌ను కూడా కలుపుకొంటే రెండు చొప్పున ఆడాల్సి ఉన్న నేపథ్యంలో చెన్నైతో పాటు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఈ రెండింటికే అధికంగా ఉన్నాయి. బెంగళూరు కూడా తన చివరి రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అదే జరిగితే- నెట్ రన్‌రేట్ కీలక పాత్రను పోషిస్తుంది. ఫలితంగా- ఆయా జట్లన్నీ తమ భారీ తేడాతో తమ ప్రత్యర్థులపై నెగ్గాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications