మినీ స్టేట్ బడ్జెట్: ఐపీఎల్ ఫ్రాంఛైజీలు క్రికెటర్లకు ఇచ్చిన జీతాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 జ్వరం మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట ఆరంబమైంది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మినీ వేలం పాట ద్వారా 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఇందులో 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనికోసం 196.6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోన్నాయి. మొత్తం 292 మంది క్రికెటర్లు మినీ ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అమ్మ..ఆవకాయ్..ఐపీఎల్ ఆక్షన్: ఫీవర్ బిగిన్: సన్‌రైజర్స్ పరిస్థితేంటీ: పర్స్ ఫుల్‌గా

క్రికెటర్లకు చెల్లించే వేతనాల విలువ రూ. 6 వేల కోట్లు..
ఈ మినీ వేలం తరువాత.. ఓ అరుదైన రికార్డును ఐపీఎల్ అందుకోబోతంది. దాని విలువ.. 6,000 కోట్ల రూపాయలు. దేశంలో ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆయా ఫ్రాంఛైజీలు తమ టీమ్‌లో ఆడుతోన్న క్రికెటర్లకు వేతనాలు, రెమ్యునరేషన్ రూపంలో చెల్లించిన మొత్తం ఇది. ప్రస్తుతం ఈ సంఖ్య 5,999 కోట్ల రూపాయలు. ఈ మినీ వేలం పాట ముగిసేసరికి.. ఈ సంఖ్య ఆరు వేల కోట్లను దాటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా జట్లలోకి తీసుకోబోయే 61 మందికి చెల్లించాల్సిన వేతనాల కోసం కుదిరే కాంట్రాక్ట్‌తో ఈ మార్క్ దాటుతుంది.

భారత ఆటగాళ్లకు
ఇప్పటిదాకా 761 మంది క్రికెటర్లతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కాంట్రాక్ట్‌ను కుదుర్చుకున్నాయి. ఇందులో 464 మంది భారత క్రికెటర్లు, 297 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం వేతనంలో 56.7 శాతం అంటే.. 3,399 కోట్ల రూపాయలను ఆయా ఫ్రాంచైజీలు భారత క్రికెటర్లకు చెల్లించాయి. మిగిలిన మొత్తాన్ని వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు పంచుకున్నారు. ఐపీఎల్ ఆడే విదేశీ క్రికెటర్లకు ఫ్రాంఛైజీలు చెల్లించిన వేతనాల విలువ 2,599 కోట్ల రూపాయలు.