తెగిన జమ్మలమడుగు పంచాయతీ, రామసుబ్బారెడ్డి రాజీనామా: కడప ఎంపీగా ఆదినారాయణ పోటీ
కడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి బరిలో నిలుస్తారా? అనే ఉత్కంఠ శుక్రవారంతో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆది వైసీపీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.

పంచాయతీ తెగింది
2014లో ఆది వైసీపీ నుంచి పోటీ చేసి గెలవగా, రామసుబ్బా రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆది అధికార పార్టీలోకి రావడం... ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దీంతో ఇరువురితో ఒకటికి రెండుసార్లు భేటీ అయ్యారు. దీంతో పంచాయతీ తెగింది.

కడప నుంచి ఆదినారాయణ, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి
మొత్తానికి జమ్మలమడుగు పంచాయతీ కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశాలపై మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ పదవిని ఆది సోదరులకు ఇవ్వనున్నారు. బదులుగా రామసుబ్బా రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు అధినేత అంగీకరించారు. ఇక కడప ఎంపీ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు.

అధినేత షరతులు
గతంలోను చంద్రబాబు ఆదినారాయణ, రామసుబ్బారెడ్డిలతో భేటీ అయ్యారు. వీరి మధ్య ఒప్పందం కుదిర్చే ప్రయత్నాలు చేశారు. ఒకరు ఎంపీగా పోటీ చేయాలని, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని.. ఈ మేరకు సమస్యను పరిష్కరించుకుందామని అధినేత చెప్పారు. ఎంపీగా పోటీ చేసే వారికి ఎమ్మెల్సీ, ఎన్నికల తర్వాత కూడా వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మరొకరు జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని చెప్పారు.

ఎమ్మెల్సీ వదులుకొని, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రామసుబ్బారెడ్డి
ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య ఒప్పందం కుదిరింది. తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, అందుకు అనుగుణంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆయనకు జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు అయింది. ఈ మేరకు రామసుబ్బారెడ్డి (ఎమ్మెల్సీగా) తన రాజీనామా లేఖను అధినేతకు ఇచ్చారు. ఇక, ఆదినారాయణ వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తారు. ఆది ఎంపీగా పోటీ చేస్తారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!