సొంత నియోజకవర్గ పర్యటనకు వైఎస్ జగన్..!!
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తోన్నారు. ఇప్పటికే ఆయన పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బుధవారం అన్నమయ్య జిల్లాకూ వెళ్లనున్నారు. మదనపల్లిలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇది ముగియగానే తన సొంత జిల్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శిలాఫలకం వేశారు. రెండు రోజుల తరువాత ఉత్తరాంధ్ర గడ్డపై అడుగు పెట్టారు. నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష రెండో విడత పనులను లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం మదనపల్లికి వెళ్లనున్నారు.

మదనపల్లిలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో పాల్గొననున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద విడుదల కానున్న నాలుగో విడత నిధులు ఇవి. అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఈ పథకం కింద అందజేస్తోంది ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువకు అయ్యే ఖర్చును భరిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకి బదలాయిస్తోంది.
డిసెంబర్ మొదటివారంలోనే వైఎస్ జగన్ తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో పులివెందులో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించాల్సి ఉంది. జగనన్న హౌసింగ్ కాలనీ, వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారని చెబుతున్నారు.
దీనితోపాటు పులివెందులలో రూపుదిద్దుకుంటోన్న మెడికల్ కళాశాల, గండి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ పనులను పర్యవేక్షిస్తారని సమాచారం. ఈ రెండు రోజులు ఆయన ఇడుపుల పాయలో బస చేసే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన పార్టీ నేతలతోనూ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.