టీటీడీ ఆధ్వర్యంలో నవమి బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం: నేడు అంకురార్పణ
Ram Navami 2024: కడప జిల్లాలోని అత్యంత ప్రాచీన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన బుధవారం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో కన్నుల పండువగా రామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు అర్చకులు. ఈ ఉత్సవాలకు సర్వదేవతలనూ ఆహ్వానించనున్నారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కల్యాణోత్సవం కొనసాగుతుంది. కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తుల ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తోన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేసేలా చర్యలు తీసుకున్నారు. కౌంటర్లు, గ్యాలరీలలో కూర్చునే వారికి ప్రసాదాలను అందజేయడానికి అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేశారు. భక్తులకు తగిన భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
శ్రీరామనవమి నాడే.. భక్త పోతన జయంతి కూడా కావడంతో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. 17, 18వ తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పండితులు శంకర్, ఎం నారాయణ రెడ్డి, డాక్టర్ సుమన, గోపాలకృష్ణ శాస్త్రి, శివ శంకర్, శివారెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, వెంకటరమణ, నీలవేణి, వెంకటేశ్వర ఆచారి, మధుసూదన్, మల్లికార్జున రెడ్డి, నరసింహులు, జగన్నాథ్ ఈ రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications