ఒంటిమిట్ట ఆలయంలో నేడే సీతారాముల కల్యాణోత్సవం: అన్ని ఏర్పాట్లు పూర్తి
Vontimitta Temple: కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రాచీన కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనుంది టీటీడీ. ఈ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తుల ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతాఅధికారులు అంచనా వేస్తోన్నారు.

భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, మంచినీరు, విద్యుత్, పుష్పాలంకరణలు, భద్రత, ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. తొక్కిసలాట చోటు చేసుకోకుండా కల్యాణోత్సవం వేదిక మొదలుకుని అన్ని చోట్లా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం గ్యాలరీలను కట్టారు.
టీటీడీ సెక్యూరిటీ విభాగం- జిల్లా యంత్రాంగంతో సహకారంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. మజ్జిగ, వాటర్ పాకెట్లను సిద్ధంగా ఉంచారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి 150 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 1,500 మంది శ్రీవారి సేవకులు ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తారు.

కల్యాణోత్సవాన్ని నేరుగా తిలకించలేనివారి కోసం 28 ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఉపశమనం కలిగించడానికి 200కి పైగా ఎయిర్ కూలర్లను అందుబాటులో ఉంచారు. సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందిస్తారు. దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications