పొంగులేటికి పొగబెట్టారు- బయటికెళ్తే పాన్ డబ్బా పెట్టుకోవాల్సిందే: పువ్వాడ వార్నింగ్
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఆయనకు సవాల్ విసిరారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. అధికార భారత్ రాష్ట్ర సమితికి ఆయన దాదాపుగా దూరం అయ్యారు. రాజీనామా చేయడం ఒక్కటే మిగిలివుందనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతోన్నాయి. తొలుత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు. కాషాయ కండువాను కప్పుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.

వైఎస్ఆర్టీపీలో..
ఈ క్రమంలో ఆయన వైఎస్ షర్మిల సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరొచ్చని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు సాగించారు. సుదీర్ఘంగా టెలిఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరితే భారీ ఆఫర్ ఇస్తామనే హామీ సైతం షర్మిల చేసినట్లు చెబుతున్నారు. దీనికి పొంగులేటి కొన్ని షరతులను విధించారని, వాటిపై ఓ అంగీకారానికి వస్తే- వైఎస్ఆర్టీపీలో ఆయన చేరిక లాంఛనప్రాయమే అవుతుందని అంటున్నారు.

వైఎస్ కుటుంబంతో..
నిజానికి- వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తోన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేశారు పొంగులేటి. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు.

జిల్లా రాజకీయాల్లో వేడి..
ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోన్నాయి. వైఎస్ షర్మిల కూడా ఈ జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేయనున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీపై విమర్శల దాడి తీవ్రతరమైంది. అదే క్రమంలో పొంగులేటిపై కూడా మాటల యుద్ధానికి దిగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. దమ్ముంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్- పొంగులేటికి సవాల్ విసిరారు.

వైరాలో..
జిల్లాలోని వైరాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పువ్వాడ పాల్గొన్నారు. పొంగులేటి అనుచరులందరూ బీఆర్ఎస్ కు రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ లో కొనసాగాలంటే కేసీఆర్ కు విధేయులుగానే ఉండాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ను వీడి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయిందని, పార్టీని వదిలేస్తే అధోగతి తప్పదని పువ్వాడ అన్నారు.

పార్టీలు పాన్ డబ్బాలుగా..
కేసీఆర్ చెయ్యి వదిలేసిన కొందరు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టారని, అవన్నీ ఇప్పుడు పాన్ డబ్బాలుగా మారిపోయాయని పువ్వాడ అజయ్ ఎద్దేవా చేశారు. గ్రూపు రాజకీయాలు పార్టీకి ఏ మాత్రం మంచివి కావని హితబోధ చేశారు. కేసీఆర్ ఎవరికీ అన్యాయం చేయకుండా పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో ప్రగి సాధించిందని, అదంతా కళ్ల ముందు కనిపిస్తోందని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications