బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంతపని చేశారు..!!
మంచిర్యాల్: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన చేసిన పనిని జాతీయ మీడియా సైతం హైలైట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనపై పోలీసులు సైతం విచారణ మొదలు పెట్టారు. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆయన కారును అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.

టోల్ అమౌంట్ ను వసూలు చేయడానికి వారు ఆయన కారును ఆపడంతో దుర్గం చిన్నయ్య ఆగ్రహోదగ్రుడయ్యారు. కారు దిగి నేరుగా టోల్ బూత్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. సిబ్బందితో గొడవ పడ్డారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. ఆయన అనుచరులు వారిస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా పట్టించుకోలేదు. టోల్ ప్లాజా సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారం అంతా టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంతపని చేశారు..!!#BRS, #Telangana, #DurgamChinnaiah pic.twitter.com/gQXLWOAW64
— oneindiatelugu (@oneindiatelugu) January 4, 2023
ఈ ఘటనపై మందమర్రి పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. టోల్ ప్లాజా వద్ద గొడవ జరిగిన విషయం, ఎమ్మెల్యే- అక్కడి సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఫిర్యాదులు అందితే కేసు నమోదు చేస్తామని మందమర్రి పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications