Nalgonda: నెల రోజుల క్రితమే పెళ్లి.. యువ జంటను కబళించిన ఇసుక ట్రాక్టర్..
విధిని ఎవరు తప్పించలేరంటారు. విధి ఆడే నాటకంలో మనం కేవలం నిమిత్త మాత్రులమేనని చెబుతుంటారు. అవును ఇది కొన్నిసార్లు నిజమనిపిస్తుంటుంది. నెల రోజుల క్రితం ప్రేమ వళ్లి చేసుకున్న యువ జంటను మృత్యువు ఇసుక ట్రాక్టర్ రూపంలో వచ్చి కబళించింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులో జరిగింది. యువ జంట మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.
కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన చిత్తలూరు మహేష్ అదే ఊరికి చెందిన రిషిత ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పకోకపోవడంతో పెద్దలను ఎదురించి నెల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. బుధవారం సాయంత్రం మహేష్, రిషిత కలిసి నల్గొండలోని బంధువుల ఇంటికి పల్సర్ బైక్ పై వెళ్లారు. తిరిగి సొంతూరు బయల్దేరారు. రాత్రి 8 గంటల 45 నిమిషాల సమయంలో తాటికల్ ఊరు శివారు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ వీరిని బలంగా ఢీకొట్టింది.

దీంతో మహేష్, రిషిత ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో మహేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కోన ఊపిరితో ఉన్న రిషితను తాటికల్ గ్రామస్థులు అంబులెన్స్ లో నల్గొండకు తరలించారు. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రిషిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో
ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలాన్నినకిరేకల్ ఎస్సై సుధీరు కుమార్ పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. యువ జంట మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రిషిత, మహేష్ అంటూ వారి తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కాగా మంగళవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా అనంతసాగరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట వస్తుండగా.. క్వాలిస్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications