హాజీపూర్ వరస హత్య కేసులో సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారణ
హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ ఫోక్సో కోర్టు దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని నిర్ధారించింది. అంతకుముందు నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో జడ్జి మాట్లాడారు. మూడు హత్య కేసులో నేరాభియోగం రుజువైందని న్యాయమూర్తి అనగా.. తాను తప్పు చేయలేదని నిందితుడు రోదించాడు. కావాలనే తనను ఇరికించారని వాపోయాడు.
సైకో శ్రీనివాస్ రెడ్డికి శిక్ష: 90 రోజుల్లో విచారణ, మేజిస్ట్రేట్‌తో ఆసక్తికర సంభాషణ

ఇరికించారు
మూడు కేసుల్లో ప్రాసిక్యూషన్ దోషిగా తేల్చిందని.. నిందితుడు శ్రీనివాస్‌తో జడ్జీ ప్రస్తావించారు. తనకేం తెలియదని, తనను కావాలని ఇరికించారని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు.

నాకేం తెలియదు..?
మూడు హత్య కేసులతో తనకు సంబంధం లేదని నిందితుడు తెలిపాడు. తనను వదిలేయాలని తల్లిదండ్రులను చూసుకోవాలని జడ్జిని అభ్యర్థించాడు. పేరెంట్స్‌కు ఎవరూ లేరని.. తన ఇల్లును కూడా కూల్చివేశారని తెలిపారు. నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలుసా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు తెలియదని సమాధానం ఇచ్చాడు.

బాలికలపై అఘాయిత్యం, హత్య
గతేడాది మైనర్ బాలికలకు శ్రీనివాస్ రెడ్డి లిప్ట్ ఇస్తానని చెప్పి.. తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి చేసి.. దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఫోక్సో పాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

90 రోజుల్లో విచారణ
గతేడాది సైకో శ్రీనివాస్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బాలికల మృతదేహలు వ్యవసాయ బావిలో కనిపించాయి. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. కేసులో జూలై 31వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత అక్టోబర్ 14వ తేదీ నుంచి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. లైంగికదాడి హత్యకు సంబంధించి 101 మంది సాక్షులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు సైకో శ్రీను ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫున బలంగా వాదించారు.