ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ నయా లీడర్ గిరి
నల్గొండ : ఎన్నికల వేళ ఓట్లేయమని ప్రాధేయపడతారు లీడర్లు. జనాల్లోకి వెళ్లి షేవింగులు, పంక్చర్లు చేస్తారు. ఎక్కడాలేని ప్రేమను చూపి మీకు అండగా ఉన్నామంటారు. అర్ధరాత్రైనా, అపరాత్రైనా సాయం కోరితే మీ దగ్గర వాలిపోతానంటారు. కానీ, గెలిచాక సీన్ రివర్స్ అవుతోంది. ఓట్లు కావాలని దండమెట్టి అడిగినోళ్లు ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఐదేళ్లు నా రాజ్యమే అనుకుంటున్నారో, ఏమోగానీ కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్న తీరు నయా లీడర్ గిరికి సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రజలే దేవుళ్లంటూ ప్రచారంలో ఊదరగొట్టే నేతలు.. గెలిచి ఒడ్డున పడ్డాక స్వరం మార్చుతున్నారు. ప్రజలను దేవుళ్లంటూ సంబోధించిన నోళ్లే పిచ్చికుక్కలంటూ కారుకూతలు కూస్తుండటం గమనార్హం.

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహనం కోల్పోయారు. ప్రజాక్షేత్రంలో సుర్రుమంటూ ఒంటికాలితో లేచారు. ఓటేసిన జనాల్నే పిచ్చికుక్కలంటూ సంబోధించారు. మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసంటూ రెచ్చిపోయి మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసి జనాలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఓట్ల పండుగ నాడు దండమెట్టిన ఈ లీడర్.. ఇలా మాట్లాడుతున్నారేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.
పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల కిందట జిల్లాలోని కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలో పర్యటించారు భూపాల్ రెడ్డి. అయితే స్థానిక సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై చిర్రుబుర్రులాడారు. మంచినీళ్లు రావడం లేదనే విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అదే ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

నాకే అడ్డమొస్తారా..?
ఊహించని పరిణామంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కంగుతిన్నారు. ఆయనకు ఏం చేయాలో తెలియక నోటికి పనిచెప్పారు. ఓట్లేసిన జనాలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు తిట్టేశారు. తనను అడ్డుకోవడం సరికాదంటూ.. రేపు చెప్తా మీ సంగతి అంటూ ఫైరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత తానేంటో చూపిస్తానంటూ ధ్వజమెత్తారు. నా ప్రచారానికే అడ్డమొస్తారా అంటూ రుసరుసలాడారు.
అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం.. ఆ తర్వాత సర్పంచ్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం.. ఇదంతా కూడా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి దిక్కు లేకుండా పోవడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్
పరిషత్ ఎన్నికల తర్వాత ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైరయ్యారు భూపాల్ రెడ్డి. నేను మామూలు మనిషిని కాదు.. గాజులు పెట్టుకోలేదు.. నేనెంటో చూపిస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇటీవలే తాగునీటి సమస్యపై ఓ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఇలాగే ప్రశ్నిస్తే సదరు ఎమ్మెల్యే ఇలాగే చిందులు తొక్కారట. మొత్తానికి సహనం కోల్పోయిన భూపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం దుమారం రేపుతోంది.












Click it and Unblock the Notifications