మేకపాటి vs మేకపాటి: చంద్రశేఖర్ రెడ్డికి చెక్- ఉదయగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ అపాయింట్
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇదీ ఒకటి. 2014లోనూ మెజారిటీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుందీ పార్టీ. ఇప్పుడు అదే జిల్లా నుంచి తిరుగుబాట్లు మొదలయ్యాయి. అసమ్మతిని ఎదుర్కొంటోంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ పార్టీకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వారిద్దరిపైనా వేటు వేసింది వైసీపీ అగ్రనాయకత్వం.

వెంకటగిరి, నెల్లూరు రూరల్ స్థానాలకు కొత్తగా కోఆర్డినేటర్లను గతంలోనే అపాయింట్ చేసింది. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అప్పగించింది. లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి.. నెల్లూరు రూరల్ స్థానం ఇన్‌ఛార్జీగా నియమిస్తూ ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అసమ్మతి ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాలేదు. ఉదయగిరికీ పాకింది.
ఉదయగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం అగ్రనాయకత్వంపై తిరుగుబాటు లేవనెత్తారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డ సహా పలువురు నాయకులపై ఘాటు విమర్శలను సంధిస్తూ వస్తోన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌నూ కలిశారు.
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ.. చంద్రశేఖర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. తాజాగా నియోజకవర్గ ఇన్‌ఛార్జీని కూడా ప్రకటించింది. మేకపాటి కుటుంబానికే చెందిన రాజా రెడ్డిని ఉదయగిరి ఇన్‌ఛార్జీగా అపాయింట్ చేసింది. మేకపాటి రాజారెడ్డిని ఉదయగిరి ఇన్‌ఛార్జీగా నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications