టీడీపీతో టచ్‌లో ఉన్న వైసీపీ సీనియర్- సస్పెన్షన్ వేటు
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో సమస్యలను సృష్టిస్తోన్నాయి. పార్టీలో ఉంటూ తిరుగుబాటు చేసిన ఇద్దరు సీనియర్ శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి- ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వారే. పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వారు సస్పెండ్ అయ్యారు.
ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాకే చెందిన సీనియర్ నాయకుడిపై వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లాలోని కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నిర్ధారించినందున సుకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు వివరించింది.

సుకుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయని తెలుస్తోంది. నెల్లూరు గ్రావెల్ మాఫియాను ఆయన నడిపిస్తోన్నట్లు చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం, తెలుగుదేశం నాయకులతో టచ్‌లో ఉండటం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిపై ఆరా తీసింది వైసీపీ అగ్రనాయకత్వం.
అవి నిజమని తేలడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు సుకుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వారి అనుచరులను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మన్నెమాలను కూడా సస్పెండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న నెల్లూరు జిల్లాలోనే ఇంతమంది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తోండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications