చిన్న బ్రేక్ ఇచ్చా- పార్టీ మార్పుపై తేల్చేసిన అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. తన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ద్వారకానాథ్‌ను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు. తనను కోస్తే జగన్ కనిపిస్తాడని పేర్కొన్నారు. జగన్‌కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడినని, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారబోతోన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. ఆ ఛానళ్ల కోరిక తీరదంటూ ఎద్దేవా చేశారు.

మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో 20 రోజుల పాటు దూరంగా ఉన్నానని అన్నారు. చిన్న బ్రేక్ ఇచ్చానని, రేపటి నుంచి తన సత్తా చూస్తారంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారాయన. ఫుల్ ఎనర్జీతో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్రేక్ తీసుకున్నానని, నెల్లూరులో ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
2024లో మళ్లీ పోటీ చేస్తానని, ఎవరు అడ్డుగా వచ్చినా గెలిచి చూపిస్తానని సవాల్ చేశారు. ఎవరు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ వేగంతో గుద్దేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తన ప్రత్యర్ధులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వారికి ఓటమి తప్పదని అన్నారు. జిల్లా రాజకీయాల్లో పెద్ద కుటుంబంగా చెప్పుకునే ఆ పేరునే లేకుండా చేశానని చెప్పుకొచ్చారు. ఓ రాజమాతను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేయించాలని తహతహ లాడుతున్నారని, అది సాధ్యపడదని అన్నారు.

చిన్న వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ప్రతిష్ఠాత్మకమైన జల వనరుల శాఖ మంత్రిగా పని చేశానని, అది తనకు జగన్ ఇచ్చిన అవకాశమని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సారి ఎన్నికల నుంచి తనను తప్పుకోవాలంటూ జగన్ ఒక్కమాట చెబితే సంతోషంగా వెనక్కి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు. జిల్లాకు చెందిన కొందరు నాయకులు జగన్‌ను తిడుతుంటే వైసీపీ నాయకులు మౌనంగా ఉంటోన్నారని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications