మరో విషాదం: ఉరివేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిలు, మరో ప్రైవేట్ కాలేజీలో వివిధ కారణాలతో మరణించగా.. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మూడో సంవత్సరం చదువుతున్న గోలి రక్షిత అనే విద్యార్థిని ఎస్సీ ఉమెన్స్ హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెండోరాకు చెందిన రక్షిత.. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉన్న ఎస్సీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లేది. ఎప్పటిలాగే కాలేజీ నుంచి తిరిగొచ్చిన రక్షిత.. రాత్రి అందరితో కలిసి భోజనం చేయకుండా ఒంటరిగా తన గదిలోకి వెళ్లింది. స్నేహితులు అడిగితే.. తర్వాత తింటానని చెప్పింది.

గదిలోకి వెళ్లి సుమారు అరగంట అవుతున్నా రక్షిత బయటకు రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశారు స్నేహితులు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వార్డెన్ ఫర్జానా బేగం కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గది తలుపులు పగలగొట్టి పోలీసులు, వసతి గృహ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రక్షితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉందంటూ అక్కడి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రక్షిత మృతి చెందినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి.












Click it and Unblock the Notifications