కరోనా భయమే ప్రాణం తీసింది: తల్లి కళ్ల ముందే కొడుకు మృతి, భోరుమన్న మాతృమూర్తి
నిజామాబాద్: ప్రస్తుతం సమయంలో ఎక్కడ ఎలాంటి అనారోగ్యమైన కరోనా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, నొప్పులు లక్షణాలుంటే అది కరోనానే అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు చేసుకుంటే అది కరోనా లేదా అనే విషయం బయటపడిపోతుంది. కానీ, కరోనా వచ్చిందా? అనే భయం కూడా ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Recommended Video

తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి.. కరోనా నెగిటివ్..
వివరాల్లోకి వెళితే.. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన అశోక్(30) కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా అనే అనుమానంతో అతడ్ని.. తల్లి , సోదరుడు ఆదివారం రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ర్యాపిడ్ ఫలితంలో నెగిటివ్ అని వచ్చింది.

రెండోసారి పరీక్షలు
అయితే, అశోక్ జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో మరోసారి పరీక్షలు నిర్వహించాలని అతని కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందిని కోరారు. రెండోసారి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆస్పత్రి ఆవరణలోని ఓ చెట్టు దగ్గర సేద తీరేందుకు కూర్చున్నారు.

కరోనా భయంతో ఆగిన కొడుకు గుండె.. భోరుమన్న తల్లి..
కాగా, చెట్టుకు ఒరిగి కూర్చున్న కుమారుడు అశోక్‌లో కదలికలు లేకపోవడంతో అతడి దగ్గరి వెళ్లి తట్టి చూసింది తల్లి గంగామణి. కొడుకు మృతి చెందాడని గ్రహించి భోరున విలపించింది. చెట్టంత కొడుకు కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ మాతృమూర్తి కడుపుకోతను భరించలేకపోయింది. ఆ తల్లి రోదనలు అక్కడున్నవారిని కలిచివేశాయి.

రెండోసారి పరీక్షలోనూ కరోనా నెగిటివ్..
అశోక్ మరణించిన కాసేపటికి రెండో టెస్టుకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయి. అందులోనూ కరోనా నెగిటివ్ అనే వచ్చింది. కరోనా వచ్చిందనే ఆందోళనతో అశోక్ మృతి చెందాడని తెలుస్తోంది. కాగా, తీవ్ర జ్వరం తోపాటు గుండెపోటుతో అశోక్ మృతి చెంది ఉంటాడని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మృతుడు అశోక్ కు భార్య లక్ష్మి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అతని మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆదివారం 43 మంది మరణించారు.












Click it and Unblock the Notifications