రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్
నిజామాబాద్: కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆర్మూర్‌లో నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడు రోజులపాటు విజయవంతంగా సాగిన కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర ఆర్మూరు సభతో ముగిసింది.
అక్టోబర్ 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగింది. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో వెళ్లనున్న రాహుల్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

అంతకుముందు పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనకు దేశంలో ఇల్లు అవసరం లేదని.. కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్న చోటు చాలు తనకని అన్నారు. కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ, ఐటీ విచారణలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పరస్పరం సహకరించుకుంటాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు.. భారత్ రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని రాహుల్ గాంధీ సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయ్యిందని.. ఆ పార్టీలోని నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామని అడుగుతున్నారని రాహుల్ చెప్పారు. వచ్చే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఈసారి ఏర్పడేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications