ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు ; ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన, మరో దుమారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు విమర్శనాస్త్రాలుగా పనికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. నిన్నటికి నిన్న చెత్త తరలించే ట్రాక్టర్లో గణేష్ విగ్రహాలను తరలించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం కాగా, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రికార్డింగ్ డాన్సులు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చెత్త ట్రాక్టర్లలో వినాయక విగ్రహాల తరలింపు ఘటన మరచిపోకముందే మరో ఘటన
నిన్నటికి నిన్న వినాయకుడి విగ్రహాలు చెత్త తరలించే ట్రాక్టర్ లలో తరలించిన ఘటన ఏపీలో చర్చనీయాంశం అయ్యింది . గుంటూరు మున్సిపల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వినాయక విగ్రహాలను తరలించే ట్రాక్టర్లో తీసుకువెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, పారిశుద్ధ్య సిబ్బంది పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శానిటరీ సూపర్ వైజర్ ను విధుల నుంచి తప్పించి ఈ ఘటనపై విచారణ జరపాలని డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు. ఈ ఘటన మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది.

కందులాపురంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్స్ ల రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో కంభం మండలం కందులాపురం గ్రామంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రికార్డింగ్ డాన్స్ ల రచ్చ ఇప్పుడు ఏపీ సర్కార్ ను టార్గెట్ చేసేలా చేస్తోంది. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామంలో దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలతో ఆలయ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలకు, భక్తులకు ఎంటర్టైన్మెంట్ కోసం ఆలయం దగ్గర రికార్డింగ్ డాన్స్ ని ఏర్పాటు చేశారు.
డీజే పాటలతో యువతుల చిందులు .. చూస్తూ ఊరుకున్న పోలీసులు
డీజే పాటలతో, యువతులు డాన్సులు వేస్తూ ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా సాగించారు. ఇక స్థానిక ప్రజలు డాన్స్ లను చూసి తెగ ఎంజాయ్ చేశారు. గుడిలోన నా స్వామి, గుడి వెనక నా స్వామి అంటూ వారు వేసే చిందులను గ్రామస్తులు, కార్యక్రమ నిర్వాహకులు బాగా ఎంజాయ్ చేశారు. పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ అవేవీ తమకు పట్టనట్టు వ్యవహరించారు.ఇక ఈ విషయం తెలిసిన పలువురు గుడి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎవరైనా భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు పెట్టుకుంటారు కానీ రికార్డింగ్ డాన్స్ లేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
ఏపీ సర్కార్ కు తలనొప్పిగా మారుతున్న వరుస ఘటనలు
ఆలయం దగ్గర ఇంతా జరుగుతుంటే పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేయటం, జనం అంత గుమికూడి చూడటం కరోనా నిబంధనలు ఉల్లంఘించడం కాదా అంటూ నిలదీస్తున్నారు. రికార్డింగ్ డాన్స్ లను కట్టడి చేయాల్సిన పోలీసులే చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే ఈ రచ్చ అవసరమా అని అడుగుతున్నారు. ఇక దేవాలయ ప్రతిష్ట ఒక పవిత్ర కార్యక్రమం అని, అలాంటి చోట రికార్డింగ్ డ్యాన్సులతో అపవిత్రం చెయ్యటం అవసరమా అని అడుగుతున్నారు. ఇక ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి చిరాకు కలిగించే వ్యవహారంగా మారింది.












Click it and Unblock the Notifications