ఐపీఎల్ 2024 వేలంపై కన్నేసిన పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్
ఇస్లామాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ప్లేయర్లెవరూ ఆడట్లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం అనేది బహిరంగ రహస్యమే. ఇదివరకు షాహిద్ అఫ్రిది, షోయబ్ అఖ్తర్, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, సల్మాన్ బట్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ ఆసిఫ్, సొహైల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్, అజర్ మహమూద్.. వంటి ఆల్ రౌండర్లు ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించారు.
ఆ తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం వల్ల పాకిస్తాన్ ప్లేయర్లెవరూ ఐపీఎల్‌లో ఆడట్లేదు. ఫ్రాంఛైజీలన్నీ వారిని దూరం పెట్టాయి. ఇప్పుడు మళ్లీ ఒకరిద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. ఐపీఎల్‌పై కన్నేశాడు. ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు కూడా.

దీనికి కారణం లేకపోలేదు. మహ్మద్ అమీర్ 2020లో యూకేకు వెళ్లిపోయాడు. అక్కడే స్థిరపడ్డాడు. ఇప్పటికే బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 2024 నాటికి అతనికి పాస్‌పోర్ట్ లభించే అవకాశం ఉంది. అది లభిస్తే- ఇక బ్రిటీష్ పౌరుడిగా గుర్తింపు పొందుతాడు. ఆ కారణంతో అతను ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు లేకపోలేదు.
2024 నాటికి తనకు బ్రిటీష్ పాస్‌పోర్ట్ లభిస్తుందని, దీని తరువాత ఇక ఐపీఎల్‌లో ఆడటానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు. బ్రిటీష్ పాస్‌పోర్ట్ అందుకున్న తరువాత తనకుక అత్యుత్తమ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు అమీర్. భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఎవరికీ తెలియదని, ఐపీఎల్ వేలంలో పాల్గొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించాడు.

పాస్‌పోర్ట్ చేతికి అందిన వెంటనే ఐపీఎల్‌లో ఆడటంపై దృష్టి సారిస్తానని చెప్పాడు. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆడాలనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పాడు. ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాల్సి వస్తే అది పాకిస్తానే అవుతుందని పేర్కొన్నాడు. మరో దేశానికి ఆడే ఆలోచన లేదని అన్నాడు. ఐపీఎల్ అన్ని దేశాల ప్లేయర్లకూ అద్భుత అవకాశాలను ఇస్తోందని చెప్పాడు.












Click it and Unblock the Notifications