లోకసభ ఎన్నికలు 2019 : రాజమండ్రి నియోజకవర్గం గురించి తెలుసుకోండి

రంజైన రాజకీయాలకు చిరునామా గా ఉండే రాజమండ్రి లోక్‌సభ లో ఎప్పుడూ ఎన్నికల్లో ప్రత్యేకత చాటుకుంటూనే ఉంది. పలువురు ప్రముఖులు ఇదే నియెజకవర్గం నుండి లోక్‌సభ లో కాలు పెట్టారు. పలువురు ఇక్కడి నుండి ప్రాతిని ధ్యం వహిస్తూనే కేంద్ర మంత్రులయ్యారు. సోదరులైన పట్టాభిరామారావు..సత్యనారాయణ రావులు ఇద్దరూ కేంద్ర మంత్రులుగా పని చేసారు. ప్రస్తుతం నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచే ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇక్కడి నుండి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక, 2014 లో ప్రమఖ సినీ నటుడు మురళీ మోహన్ ఇక్కడి నుండే లోక్‌సభకు ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాల్లో రాజమండ్రి నుండి గెలుపు ప్రతీ పార్టీ కి కీలకమే. అసలైన వ్యూహా - ప్రతి వ్యూహాలు ఇక్కడి రాజకీయాల్లో కనిపిస్తాయి.
17 సార్లు ఎన్నికలు..
రాజమండ్రి లోక్‌సభ స్థానం లో 1952 నుండి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు సిపిఐ ఒకసారి, కాంగ్రెస్ పది సార్లు, సోషలిస్టు పార్టీ ఒకసారి, టిడిపి మూడు సార్లు, బిజెపి రెండు సార్లు గెలుపొందాయి. డిఎస్ రాజు మూడు సార్లు, పట్టాభిరామా రావు మూడు సార్లు, ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆరుగురు కమ్మ నేతలు 8 సార్లు ఇక్కడి నుండి ఎంపీలుగా గెలుపొందారు. ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు మూ డు సార్లు గెలిచారు. రెండు సార్లు కాపు, ఒక సారి క్షత్రియ, ఒకసారి ఎస్సీ వర్గానికి చెందిన వారు గెలిచారు. 2014 ఎన్నిక ల్లో కమ్మ వర్గానికి చెందిన మురళీ మోహన్ విజయం సాధించారు.
2014 లో టిడిపి గెలుపు.. 86 శాతం పోలింగ్..
రాజమండ్రి లోక్‌సభ నియోజకర్గ పరిధిలో మొత్తం 1421288 ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 735347 మంది ఉన్నారు. కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 752151 గా నమోదైంది. ఇక, 2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 1154381 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుష ఓటర్లు 577999 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 576382 గా నమోదైం ది. మొత్తం పోలింగ్ 86 శాతంగా నమోదైంది. ఇక్కడి నుంటి టిడిపి నుండి పోటీ చేసిన మురళీ మోహన్ కు 630573 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన బొడ్డు వెంకట రమణ చౌదరికి 463139 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి మురళీ మోహన్ వైసిపి అభ్యర్ధి పై 167434 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

లోక్‌సభ సభ్యుడిగా మురళీమోహన్..
తొలి సారి లోక్‌సభ లో అడుగు పెట్టిన మురళీ మోహన్ గోదావరి పుష్కరాల సమయంలో కీలక పాత్ర పోషించారు. ఇక, సభ్యుడిగా సభలో జరిగిన 55 చర్చల్లో పాల్గొన్నారు. ఒక ప్రయివేటు బిల్లును ప్రతిపాదించారు. డిసెంబర్ చివరి వరకు సభ్యుడిగా 247 ప్రశ్నలను సంధించారు. సభకు హాజరు శాతం 86 గా నమోదైంది. ఇక, ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయట కు వచ్చిన తరువాత టిడిపి సభ్యుడిగా సభలో జరిగిన నిరసనల్లో మురళీ మోహన్ యాక్గివ్ గా పాల్గొన్నారు. ప్రస్తుత లోక్ సభ సమావేశాల్లో టిడిపి ఎంపీలు ఆందోళనకు దిగటం..ఏపికి రావాల్సిన విభజన చట్టం హామీల అమలు కోసం ఆందో ళనలు కొనసాగించారు. వాటిలో మురళీ మోహన్ సైతం పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం..
రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ సారి రాజకీయంగా కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి వైసిపి నుండి బసి అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. అదే విధంగా.. టిడిపి నుండి మురళీమోహన్ లేదా ఆయన కోడలు పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్ నుండి ఇక్కడి నుండి బరిలో ఉంటామని పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక, రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ.. తాజాగా రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ జనసేన నుండి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయటం ఖాయంగా కని పిస్తోంది. దీంతో..ఈ సారి చతుర్ముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.