తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్.. ఏపీలో రిపీట్: రోజా ఏం చెప్పారు?
రాజమండ్రి: తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. 39 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 119 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 64 సీట్లను సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదంటూ జోస్యం చెబుతోంది. టీడీపీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తోంది.
దీనిపై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా స్పందించారు. రాజమండ్రిలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఎటువంటి సంబంధం లేదని, 2024లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అన్నారు.

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అది చూసి పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేరుతారు.. ఇది తథ్యమంటూ ఎద్దేవా చేశారు రోజా. వ్యవసాయం దండగ అంటూ రైతాంగాన్ని అవహేళన చేసిన పెద్దమనిషి చంద్రబాబు అని విమర్శించారు.
రైతులు ఆత్మహత్య చేసుకునేలా పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రబాబు అంటూ రోజా ధ్వజమెత్తారు. రైతులకు అండగా ఉంటానంటూ ఇప్పుడు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతులకు అండగా ఉన్నది గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర‌్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్ అని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను తమ ప్రభుత్వం నిర్మించిందని, ప్రతి గ్రామంలోనూ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తోందని అన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వైఎస్ జగన్‌దేేనని చెప్పారు.












Click it and Unblock the Notifications