నన్ను తీసుకోమని చంద్రబాబు చెప్పారు!
వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించినవారంతా తిరిగి వారి వారి స్థానాల నుంచే పోటీచేయాలని చంద్రబాబు చెప్పారన్నారు.
తాను రాజమండ్రి రూరల్ నుంచే బరిలోకి దిగుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నారన్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ ను జనసేనకు కేటాయిస్తున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ సీటు తనకే అని బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం.

వైసీపీ ప్రభుత్వంలో పేదవాళ్లపై విద్యుత్తు ఛార్జీలు గుదిబండలా భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థ విధానాలతో విద్యుత్తు రంగం కుదేలైందని.. గతంలో రూ.500 వచ్చే బిల్లు ఇప్పుడు రూ.1600 వస్తోందన్నారు. అప్రకటిత కోతల వల్ల పరిశ్రమలు కుంటుపడుతున్నాయని.. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కేవలం రూ.5 కే విద్యుత్తును కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో రూ.12, ఆపై కొనుగోలు చేసి, ఆ భారం మొత్తాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు.
ఏపీలో పవర్ కి కూడా హాలిడే ప్రకటించే దుస్థితి ఉందని, విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ 35 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఇస్తే.. జగన్ సర్కార్ మాత్రం కేవలం 8 లక్షలు కూడా ఇవ్వలేని స్థితికి చేరిందన్నారు.
చంద్రబాబు పర్యటనలు, లోకేష్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలను ఎవరూ ఆపలేరని, కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు. నిధులన్నీ గోల్‌మాల్ అయ్యాయని, విద్యుత్తు కోతలతో గృహ వినియోగదారులతో పాటు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితికి ప్రభుత్వ అసమర్ధతే కారణమంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications