మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని సారవకోట మండలం అక్కివలస వద్ద జగన్ బస చేశారు.
ఈ ఉదయం 9 గంటలకు అక్కివలస నైట్ క్యాంప్ నుంచి బయలుదేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు పరశురాంపురం నుంచి బయలుదేరుతారు. అక్కవరానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5:30 గంటల వరకు సభ కొనసాగుతుంది. జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. వారిని జగన్ పరిచయం చేస్తారు.
సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో తొలుత విశాఖపట్నం, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు.
ఇక ఈ నెల 26వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం 27వ తేదీ నుంచి చివరి విడత ఎన్నికల ప్రచారం చేపడతారు. హెలికాప్టర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటిస్తారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళ్లలేని నియోజకవర్గాలకు వెళ్లనున్నారు.
మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చివరి విడత ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ. అందులో పొందుపర్చే అంశాలను ప్రజలకు వివరించేలా, వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి లబ్దిదారులకు క్షున్నంగా తెలియజేసేలా జగన్ చివరి విడత ప్రచార కార్యక్రమాలు ఉండబోతోన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెర పడే మే 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు జగన్. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications