10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: రానున్న రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
10-12 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో: బండి సంజ్
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు, మరిన్ని ఉపఎన్నికలు వస్తాయన్నారు బండి సంజయ్. అంతేగాక, టీఆర్ఎస్ పార్టీకి చెందిన 10-12 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కొంత కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎవరు ఉంటారో.. ఎవరు వెళతారనేది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఇంకా చాలా చోట్ల ఉపఎన్నికలు: బండి
తెలంగాణలో చాలా చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, దీనికి టీఆర్ఎస్ నాయకులే కారణమవుతారని బండి సంజయ్ అన్నారు. ఇప్పటి వరకు నాలుగు ఉపఎన్నికల్లో రెండు బీజేపీ గెలిచిందని తెలిపారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మిస్తాయన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. అనేక మంది నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ వెల్లడించారు.
బీజేపీకి సానుకూలంగా కోమటిరెడ్డి బ్రదర్స్: బండి సంజయ్
కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోడీ, బీజేపీ పథకాలను ప్రశంసించారని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు వరదలో అల్లాడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మూడు రోజులు తిష్టవేశారని అన్నారు. కాగా, బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను వింటూ వారికి భరోసా ఇస్తున్నారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications