టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు: డిబార్ అయిన విద్యార్థికి ఊరట, మిగితా పరీక్షలు రాసే అవకాశం
హైదరాబాద్: పదో తరగతి హిందీ పరీక్షపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ డిబార్ అయిన విద్యార్థి హరీశ్‌కు ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పేపర్ లీకేజీ కేసులో పేపర్ లీకేజీ ఆరోపణ కింద ఏప్రిల్ 6న అధికారులు ఈ విద్యార్థిని డిబార్ చేశారు.
ఈ క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తూ తనకేం తెలియదని.. తాను పరీక్ష రాస్తుండగా.. కిటికీలోంచి ఓ వ్యక్తి చేయి పెట్టి తన పేపర్ గుంజుకున్నాడని మీడియా ఎదుట వాపోయాడు. కాగా, విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీశ్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు.

కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో కూడా హరీశ్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా, అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీశ్ ను మిగితా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. సదరు విద్యార్థిని పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థి సోమవారం నుంచి జరిగే పరీక్షలను రాయనున్నాడు.
తెలుగు, హిందీ పరీక్ష పేపర్ల లీకేజీలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పరీక్ష లీకేజీలో బాధ్యులైన ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించారు. రెండో పేపర్ లీకేజీపైనా దర్యాప్తు కొనసాగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications