కాబోయే మంత్రులకు రేవంత్ ఫోన్ - నేడు ప్రమాణ స్వీకారం చేసేది వీరే..!!
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ తో పాటుగా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు..వినతులను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ మంత్రి పదవులు ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి పదవి కేవలం భట్టికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. కాబోయే మంత్రులకు థాక్రే..రేవంత్ పోన్ చేసారు. భట్టి, ఉత్తమ్ తోనూ రేవంత్ మాట్లాడారు. ప్రమాణం చేసే మంత్రుల జాబితా ఫైనల్ అయింది.
నేడు ప్రమాణ స్వీకారం:ముఖ్యమంత్రిగా రేవంత్.. మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం పదవి కోసం చివరి వరకు రేసులో నిలిచిన భట్టి..ఉత్తమ్ కు నేరుగా రేవంత్ ఫోన్ చేసారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇతర మంత్రులకు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే...రేవంత్ ఫోన్ చేసి మంత్రి పదవులు ఖరారు అయినట్లు తెలిపారు. వారిని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది వరకు అవకాశం ఉంటుంది. అయితే, పార్టీలో సామాజిక సమతూకం - ప్రాంతీయ సమతుల్యత పాటించే క్రమంలో ముందుగా 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మిగిలిన 7 గురు విషయంలో ఈ నెల 9న నిర్ణయం తీసుకోనున్నారు.

భట్టికి మాత్రమే డిప్యూటీ:రేవంత్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా భట్టి పేరు ఖరారైంది. భట్టి కోరుకున్న విధంగా ఒక్క డిప్యూటీ సీఎం పదవినే కేటాయించాలని నిర్ణయించారు. భట్టికి డిప్యూటీ సీఎం హోదాలో రెవిన్యూ శాఖ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే వారిలో దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి పేర్లు ఖరారయ్యాయి.
హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. దీంతో..మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఈ నెల 9న రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో మిగిలిన మంత్రులెవరనేది ఖరారు కానుంది.

11 మందికి ఖరారు:ఇక, శాఖల విషయంలోనూ హైకమాండ్ సీనియర్లకు స్పష్టత ఇచ్చింది. సీఎం పదవి ఇవ్వలేకపోయినా..శాఖల విషయంలో పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. భట్టికి రెవన్యూ, ఉత్తమ్ కు మున్సిపల్ లేదా పంచాయితీ రాజ్, దామోదర్ రాజనర్సింహకు విద్యా లేదా ఆరోగ్య శాఖ కేటాయించనున్నారు. శ్రీధర్ బాబుకు ఆర్దిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఐటి శాఖ ఇస్తారని తెలుస్తోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ఖరారు అయినట్లు చెబుతున్నారు. కొండ సురేఖకు మహిళా సంక్షేమం ఇస్తారని తెలుస్తోంది. సీతక్క కు హోం శాఖ ఇవ్వాలని రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే, సీనియర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్నాహ్నం ప్రమాణ స్వీకారం తరువాత కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో సచివాలయంలో సీఎం గా రేవంత్ తొలి సమావేశం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications