కరోనావైరస్ కలకలం: గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
వరంగల్: దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరోసారి క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. బుధవారం ఒకేరోజు దేశ వ్యాప్తంగా 5వేల కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25వేలు దాటాయి.
మరోవైపు, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15 మంది కరోనా బారిన పడి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హాస్టల్‌లో ఉంటున్న కొందరు విద్యార్థులు జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో వారందరికీ గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
వెంటనే ఆ విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలోషన్‌లో ఉంచారు. కాగా, ఒకే పాఠశాలలో 15 మంది కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హాస్టల్ ఉన్న మిగితా విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు. మరోవైపు, తెలంగాణలో కూడా క్రమంగా పదుల సంఖ్యల కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications