అక్కడే చావు.. వికారాబాద్ జిల్లాలో విషాదం !!
భర్త చేసిన దూషణలు, అవమానాల కారణంగా 21 ఏళ్ల శిరీష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వంట సరిగ్గా చేయట్లేదని భార్యను పుట్టింట్లో భర్త వదిలేయడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. మహిళా సంఘాలు భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతే కాకుండా చిన్న చిన్న విషయాల పేరుతో మహిళలను వేధించే భర్తలపై కఠిన చట్ట అమలు అవసరమంటూ గొంతెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన శిరీష (21)ను, పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగంతో పెద్దలు కొద్ది నెలల క్రితమే వివాహం చేశారు. చిన్న చిన్న విషయాలకే తప్పుపట్టడం.. ముఖ్యంగా వంట బాగా రాదని తరచూ ఆమెను అవమానించడం మొదలుపెట్టాడు భర్త శివలింగం. అంతే కాకుండా శిరీష తనకంటే తక్కువగా చదువుకుందంటూ హేళన చేస్తుండేవాడని కూడా ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తీవ్ర అవమానాల మధ్య జీవనం సాగిస్తున్న శిరీష చివరకు భర్తకు ఎదురు తిరిగింది. దీంతో కోపం వచ్చిన శివలింగం తన భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చేశాడు. మరుసటి రోజు ఫోన్ చేసి నువ్వు నాకు అక్కర్లేదు... అక్కడే చచ్చిపో అని దారుణంగా దూషించాడని అంటున్నారు. ఈ మాటలు విన్న శిరీష పూర్తిగా మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వాపోతున్నారు.
కాగా కూతురు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైపోయారు. భర్త శివలింగం నిరంతరం వేధించడం, అవమానించడం, చివరకు దూషించడం వల్లే శిరీష ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిరీష ఫోన్ రికార్డులు, కాల్ డేటా, వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఆమె భర్తపై 498A, దౌర్జన్యం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి కారణాల వల్లే యువతులు ప్రాణాలు తీసుకునే ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications