కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: డేట్ ఫిక్స్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రధాని మోడీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే దేశంలో ఎన్నికలే జరగవని, ఓట్ల కోసం ఆయన మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
దేశం మొత్తం బీజేపీ నాయకుల ఆధీనంలోకి వెళ్తుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఓట్ల కోసమే బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ సంపన్నులకే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

మరోవైపు, కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్ చెప్పినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఏ నేత కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ లక్షసార్లు చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ అబద్ధాలు రామాయణం కంటే పెద్దగా ఉన్నాయని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. డిపాజిట్ల కోసమేకేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ వచ్చాక సోనియా గాంధీ కాళ్లను కేసీఆర్ మొక్కారని కోమటిరెడ్డి తెలిపారు. అప్పటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మోసగించారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఇక, కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి.
జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కూడా తమ పార్టీలోకి వస్తామని తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఆ 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications