కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల జాబితా ఇదే: నెం. 1లో జూపల్లి కృష్ణారావు, 15లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ పార్టీలో చేరికలు కూడా జోరందుకున్నాయి. తాజాగా, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందని రాహుల్ అన్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

తెలంగాణలో ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందని రాహుల్ వ్యాఖ్యానించారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అందుకు పార్టీ నేతలంతా సమష్టిగా పోరాడాలని రాహుల్ దిశానిర్దేశం చేసినట్లు నేతలు పేర్కొన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో ముందుకెళ్లాలని రాహుల్ సూచించారని తెలిపారు.
35 BRS leaders including ex Minister Jupally Krishna Rao, ex MP Ponguleti Srinivasa Reddy meet Congress chief @kharge, and ex party chief Rahul Gandhi. pic.twitter.com/2SEQnpH6gT
— Anand Singh (@Anand_Journ) June 26, 2023
కాగా, రెండు రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరడంతో ఏఐసీసీ కార్యాలయం సందడిగా మారింది. రాహుల్‌తో కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత.. పార్టీలో చేరబోయేవారి జాబితా విడుదల చేశారు. మొత్తం 35 మంది సభ్యులతో జాబితా రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో జూపల్లి కృష్ణారావు ఉండగా.. 15వ స్ధానంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు నేతలతోపాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, జానా రెడ్డి, మధుయాష్కీ షబ్బీర్ అలీ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గురునాథ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, పార్టీ కండువాలు కప్పుకోవాలని తామంతా భావిస్తున్నామని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిందిగా రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలను నేతలు ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications